Jun 23,2021 16:31

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న యుపి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగనుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌యాదవ్‌ తెలిపారు. బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి), కాంగ్రెస్‌లు రెండూ బలహీనమైన మిత్రపక్షాలని, వారితో తమ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. యుపి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ముఖ్యమంత్రి యోగి పాలనాతీరును ఎండగడుతున్నారని అన్నారు. ఆయన తన పాలనలో అవినీతి, అణచివేతను ప్రోత్సహించారని, ఫలితంగా వచ్చే ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలవడం తప్పదని అఖిలేష్‌ పేర్కొన్నారు. బిజెపిని ఓడించాలనుకుంటున్న చిన్న పార్టీలు.. తమ పార్టీతో ముందుకు నడవాల్సిందిగా కోరుకుంటున్నామని అన్నారు. 2019లో కూటమిగా ఏర్పడిన బిఎస్‌పితో తమ పార్టీ కొనసాగుతుందన్న వాదనను ఖండించిన ఆయన.. బిఎస్‌పి నేతలు కొందరు తనతో సన్నిహితంగా ఉన్నారన్నది వాస్తవమేనని చెప్పారు. బిజెపిని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని, ఆ పార్టీ బలహీనంగా మారిందని అన్నారు. 2017లో కాంగ్రెస్‌తో కూటమి ఏర్పరుచుకున్నామని, వారికి 100 సీట్లకు పైగా ఇచ్చామని.. కాని గెలవలేకపోయామని .. అప్పుడే యుపి ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పునర్నిర్మాణానికి ప్రియాంక గాంధీ కృషి చేస్తున్నారన్న ప్రశ్నకు అఖిలేష్‌ స్పందించలేదు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజాభిప్రాయ పరీక్షగా భావించే యుపి ఎన్నికల్లో.. తమ పార్టీ రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాలకు గాను 350 స్థానాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. బిజెపి ప్రభుత్వంపై యుపి ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని అది పోగొట్టుకుందని, ప్రజలను నిర్లక్ష్యం చేసిందని, .. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా ఓటమిపాలౌతుందని అన్నారు. కేంద్రం, యుపిలోని డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం రెండు వేర్వేరు దిశల్లో వెళుతున్నాయని ఎద్దేవా చేశారు. యుపిలో యోగి ఆధిత్యనాధ్‌పై అసమ్మతి వాదం, నాయకత్వ మార్పు తదితర అంశాలన్నీ మోడీ మార్కు గేమ్‌లని కొట్టిపారేశారు. మోడీ సన్నిహితుడు ఎకె.శర్మకు యుపిలో ఉన్నత స్థానాన్ని కట్టబెట్టడంపై స్పందిస్తూ.. ఢిల్లీ ప్రజలు ఆయనను మంత్రిగానే అంగీకరించలేదని అన్నారు. యుపిలో బిజెపిని బిజెపియే ఓడించి తీరుతుందని చమత్కరించారు. వ్యాక్సిన్‌ను తిరస్కరించడంపై స్పందిస్తూ.. ఆ వ్యాక్సిన్లు మూడు దశల క్లినికల్‌ పరీక్షలను పూర్తి చేయలేదని.. అందుకే తిరస్కరించానని అన్నారు. తన తండ్రి ములాయమ్‌ సింగ్‌ యాదవ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారని అన్నారు. దీపావళి నాటికి యుపి ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ వేయగలిగితే..అప్పుడు తాను వ్యాక్సిన్‌ తీసుకుంటానని యుపి ప్రభుత్వానికి చాలెంజ్‌ విసిరానని అన్నారు.