Oct 05,2022 13:44

ప్రజాశక్తి - వేంపల్లె : రైతు భరోసా కేంద్రాల ద్వారా క్వింటాల్ రూ 2500 చొప్పున ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక ఉల్లి రైతులు కంట కన్నీరు పడుతున్నట్లు చెప్పారు. ఉల్లిని కొనేవారే కనిపించడం లేరని ఒక వేళ కొన్నా క్వింటాల్ రూ.700 లకు మాత్రమే ధర ఉన్నట్లు చెప్పారు. గిట్టుబాటు కాక రైతులు ఉల్లిని పొలాల్లో నే పశువులకు వదిలి వేయడం జరుగుతున్నట్లు చెప్పారు. జగన్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు వెలవెల కాగా ప్రైవేట్ పాఠశాలలు కళకళలాడుతున్నట్లు చెప్పారు. వైకాపా ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య తగ్గిందని తెలిపారు. 2021-22 లో విద్యార్ధుల సంఖ్య 45.71లక్షలు ఉండగా 2022-23లో 41.24 లక్షలు అంటే 4.47 లక్షలు తగ్గిందన్నారు. ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని తెలిపారు. 2021-22 లో 24 లక్షల మంది ఉండగా 2022-23 లో 29.10 లక్షల మంది అంటే 5.10 లక్షలు పెరిగిందని చెప్పారు. 3,4,5 తరగతులను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల నుండి విడగొట్టి ప్రభుత్వ హైస్కూల్ లలో విలీనం చేయడం దీనికి ప్రధాన కారణం అన్నారు. దీని వలన అమ్మఒడి, విద్యా కానుక, నాడు-నేడు నిష్ప ప్రయోజనం అయ్యిందని తెలిపారు.