
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం, అక్కడ వన్‌మేన్ షో నిర్వహించడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఉదయం తాను ఈ కార్యక్రమాన్ని చూశానని, తాను అక్కడికి వెళ్లకపోవడం పట్ల సంతోషంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగింది చూసి తాను కలత చెందానని అన్నారు. ఈ కార్యక్రమం కేవలం కొద్ది మందికే పరిమితమా అని పవార్ ప్రశిుంచారు.
ప్రతిపక్షాలు లేకుండా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభించడంతో ఇది పరిపూర్ణ కార్యక్రమం కాదని ఎన్‌సిపి నేత సుప్రియ సూలే వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యానికి చోటు లేదని ఈ అంశం తేటతెల్లం చేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాని రాజులా వ్యవహరిస్తూ పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానిు తన పట్టాభిషేక కార్యక్రమంలా భావిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
- పార్లమెంట్ నూతన భవనాన్ని శవపేటికతో పోల్చిన ఆర్‌జెడి
పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొద్ది క్షణాల ముందు లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందించింది. కొత్త పార్లమెంట్ భవనం శవపేటికలా ఉందంటూ సంచలన ట్వీట్ చేసింది. శవపేటిక, పార్లమెంట్ నూతన భవనం ఫొటోలను ఆదివారం ఉదయం ఆర్‌జెడి తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దీనికి 'యే క్యా హై (ఇది ఏంటి?)' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.