May 31,2023 16:48

న్యూఢిల్లీ : తమిళనాడు, జార్ఖండ్‌ ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ బుధవారం ప్రకటించారు. కేంద్రం తీసుకువచ్చిన రాజ్యాంగ విరుద్ధ, ప్రజాస్వామ్య వ్యతిరేక, ఢిల్లీ వ్యతిరేక ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా డిఎంకె మద్దతు కోరేందుకు గురువారం తమిళనాడు సిఎం ఎంకె.స్టాలిన్‌తో సమావేశం కానున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. అలాగే జూన్‌ 2 శుక్రవారం జార్ఖండ్‌ సిఎం హేమంత్‌ సోరెన్‌తో రాంచీలో సమావేశమై ఆయన మద్దతు కోరనున్నట్లు తెలిపారు.
ఢిల్లీలో పరిపాలనా వ్యవహారాలపై నియంత్రణకు సంబంధించిన అంశంపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ బిజెపియేతర ప్రభుత్వాల మద్దతు కూడగడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్‌ రాజ్యాంగ విరుద్ధమని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్‌ చేస్తున్న పోరాటానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. అలాగే యుబిటి చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే, ఎన్‌సిపి చీఫ్‌ శరద్‌ పవార్‌, పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌లు మద్దతు ప్రకటించారు.