Jun 02,2023 21:36
  • రాష్ట్రంలోనే మొదటి ప్రభుత్వ ఆసుపత్రిగా విమ్స్‌ రికార్డు
  • నలుగురు జీవితాల్లో కొత్త వెలుగులు
  • ఏడుగురికి బతుకునిచ్చిన కొత్తపాలెం యువకుడు

ప్రజాశక్తి - ఆరిలోవ (విశాఖపట్నం), యలమంచిలి రూరల్‌ (అనకాపల్లి జిల్లా) : కార్పొరేట్‌ ఆస్పత్రులకు ఏమాత్రమూ తగ్గకుండా ఎన్నో అత్యాధునిక శస్త్ర చికిత్సలు చేసి మైలురాళ్లకు కేంద్రమైన విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌) మరో మైలురాయిని చేరుకుంది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి అవయవాలు సేకరించి రాష్ట్రంలోనే తొలి ప్రభుత్వ ఆస్పత్రిగా రికార్డు నమోదు చేసింది. సాధారణంగా బ్రెయిన్‌ డెడ్‌ కేసులకు సంబంధించి కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో మాత్రమే అవయవాలు సేకరిస్తుంటారు. మొదటిసారి విమ్స్‌లో శుక్రవారం బ్రెయిన్‌ డెడ్‌ మహిళ నుంచి అవయవాలు సేకరించి నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పి చంద్రకళ (32) గత నెల 31న తీవ్ర తల నొప్పితో అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వైద్యం నిమిత్తం ఆమెను విమ్స్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. న్యూరో సర్జరీ వైద్యుల ఆధ్వర్యంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి తలలో తీవ్ర రక్తస్రావం జరిగినట్టు గుర్తించారు. నివారణకు వైద్య బృందం తీవ్రంగా శ్రమించినప్పటికీ నియంత్రణలోకి రాకపోగా శరీరంలో ఒక్కొక్క అవయవం పనిచేయడం మానేశాయి. దీంతో వైద్యులు గురువారం చంద్రకళను బ్రెయిన్‌ డెడ్‌గా ధ్రువీకరించారు. ఈ విషయం తెలుసుకున్న విమ్స్‌ డైరెక్టర్‌, జీవన్‌దాన్‌ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె రాంబాబు మహిళ కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవదానానికి ముందుకు వచ్చేలా ప్రోత్సహించారు. కుటుంబ సభ్యుల పూర్తి అనుమతితో ఆమె నుంచి రెండు కిడీులు, రెండు కళ్లను సేకరించారు. రెండు కిడీులను విశాఖ నగరంలోని అపోలో, కేర్‌ ఆస్పత్రులకు, రెండు కళ్లను ఎల్‌వి ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి కేటాయించారు. జీవన్‌దాన్‌ ప్రొటోకాల్‌ ప్రకారం ఆ అవయవాలను అవసరమైన రోగులకు అందించారు. శుక్రవారం వేకువజాము నాలుగు నుంచి ఆరు మధ్య ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేశారు.

  • ఘన వీడ్కోలు

చంద్రకళ మృతదేహానికి విమ్స్‌ ఆసుపత్రి సిబ్బంది ఘన వీడ్కోలు పలికారు. ఆమె భౌతికకాయం వద్ద సెక్యూరిటీ సిబ్బంది గౌరవ వందనం చేశారు. అనంతరం డైరెక్టర్‌ డాక్టర్‌ రాంబాబు పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు అవయవదానం చేసినందుకు ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2900 మంది రోగులు అవయవాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారి కుటుంబ సభ్యులు ఎవరైనా అవయవాలు దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. మూఢనమ్మకాలు వీడాలని విజ్ఞప్తి చేశారు.

  • ఏడుగురికి బతుకునిచ్చిన కొత్తపాలెం యువకుడు

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌ డెడ్‌ అయిన యువకుడి అవయవాలను దానం చేసి ఏడుగురికి బతుకునిచ్చిన ఘటన అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ కొత్తపాలెంలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపాలెం గ్రామానికి చెందిన మళ్ల వెంకట మణికంఠ (22) రెండో రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలకుగాయమై రక్తస్రావం కావడంతో వైద్య సేవల కోసం విశాఖలోనికిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్య సేవలు పొందుతూ బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో తమ కుమారుడు చనిపోతూ మరికొందరికి బతుకునివ్వాలని తలంచి మణికంఠ తల్లిదండ్రులు అవయవదానం చేసేందుకు అంగీకరించారు. జీవనధార ఫౌండేషన్‌కు అవయవాలను డొనేట్‌ చేశారు. ఈ మేరకుఆ అవయవాలను ఏడుగురికి జీవితాల్లో వెలుగునింపింది. గుండెను హైదరాబాద్‌లోనిఓ ఆస్పత్రికి, మూడు అవయవాలను విశాఖ నగరంలోనిమూడు ఆస్పత్రులకు తరలించారు. మిగతా మూడు అవయవాలను కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రిలోనే భద్రపరిచారు. మణికంఠ యలమంచిలిలోని పూర్ణసాయి వివేకానంద కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మణికంఠ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాన్ని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రమాకుమారి అభినందించారు. దిమిలి రోడ్డు నుంచి కొత్తపాలెం గ్రామం వరకు జరిగిన మణికంఠ అంతిమయాత్రలో గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.