Apr 07,2021 22:08

అమరావతి బ్యూరో : ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలను టిడిపి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో గ్రామాల్లో ఓటింగు తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా వాలంటీర్లు, సచివాలయ కార్యదర్శులను ఉపయోగించింది. ఇంటింటికీ వెళ్లి ఇష్టం ఉన్నా... లేకపోయినా ప్రతిఒక్కరూ ఓటు వేయాల్సిందేనని ప్రచారం చేయించింది. ఓటు వేయడం బాధ్యత అయినప్పటికీ గతంలో జరిగిన ఎన్నికల్లో ఇటువంటి ప్రచారం చేయలేదు. అలాగే గ్రామాల్లో ఓటింగు తగ్గితే ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు ఆ గ్రామాల్లో ఉన్న వారందరికీ తగ్గుతాయని, ఓటింగు ఎక్కువగా జరిగిన గ్రామాల్లోకి వాటిని మారుస్తారనీ ప్రచారం చేశారు. మంగళ, బుధవారాల్లో ఈ తరహా ప్రచారం ఎక్కువగా సాగింది. పోటీలో ఉండబోమని టిడిపి ప్రకటన చేసిన తరువాత వాలంటీర్లకు ఈ తరహా సూచనలు వచ్చాయి. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటు వేయాలని చెప్పడంతోపాటు అప్పుడే వారి ఇళ్లలో ఉన్నసంక్షేమ పథకాల వివరాలను గ్రామాల్లో అడిగి తెలుసుకున్నారు. ఎవరింటికి ఏయే పథకాలు వస్తున్నాయనే విషయంపై పూర్తి సమాచారం ఉన్నా... ఈ రెండు రోజుల్లో ఇంటింటికీ వెళ్లడంతోపాటు వారి సంక్షేమ పథకాల వివరాలనూ కాగితాలపై రాసుకున్నారు. దీంతో చదువు రానివారు ఎక్కువమంది భయపడుతున్నారు. ఒకవేళ ఓటు వేయకపోతే పథకాలు నిలిపేస్తారేమోనని అందోళన వారిలో వ్యక్తమవుతోంది. అయితే తాము ఓటర్లను చైతన్యం చేశామని చెబుతున్నా... ఓటింగు తగ్గకుండా చూడటం ద్వారా టిడిపి బహిష్కరణ ప్రభావం లేదని చెప్పుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు టిడిపి అభ్యర్థులూ గ్రామస్థాయిలో వారి ప్రయత్నాలు వారు చేశారు. అధిష్టానం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినా గ్రామస్థాయిలో మాత్రం ఎవరికి వారు ప్రచారం చేసుకున్నారు. బహిష్కరణ ప్రకటన అనంతరం పలుచోట్ల టిడిపి తరుపున పోటీలో ఉన్నవారు వైసిపిలో చేరిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాల్లో 2,46,71,002 మంది ఓటర్లు ఉండగా, 515 జెడ్‌పిటిసి స్థానాలకు, 7220 ఎంపిటిసి స్థానాలకు పోలింగు జరగనుంది.