Oct 28,2021 13:12

* కాశ్మీర్‌లో మహిళా ఉద్యోగి తొలగింపు
బుదౌన్‌ : టి20 ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్తాన్‌ విజయంపై సంబరాలు చేసుకున్నారంటూ ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు కాశ్మీర్‌ విద్యార్థులు సహా ఆ రాష్ట్రానికి చెందిన ఒకరిపై దేశద్రోహం కేసులు నమోదు చేశారు. ఫైజ్‌గంజ్‌ బెహ్త ప్రాంతానికి చెందిన నైజ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పాకిస్తాన్‌ జెండాను పోస్ట్‌ చేశాడు. అతనిపై దేశద్రోహం, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని కొన్ని సెక్షన్ల కింద ఈ నెల 26న కేసు నమోదు చేసి, 27న జైలుకు పంపినట్లు బుదౌన్‌ ఎస్‌ఎస్‌పి ఒపి సింగ్‌ చెప్పారు. ఇప్పటికే ఇలాంటి కేసులు ఆగ్రా, బరైల్లీ, బుదౌన్‌, సితాపూర్‌ల్లో ఏడుగురిపై ఐదు కేసులు నమోదయ్యాయి. వాట్సాప్‌ స్టేటస్‌లో పాక్‌ విజయంపై పోస్టులు పెట్టినందుకు ఆగ్రాలో ఇంజనీరింగ్‌ చదువుతున్న జమ్ముకాశ్మీర్‌కి చెందిన ముగ్గురు విద్యార్థులను ఈ నెల 27న అరెస్టు చేశారు. వీరిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఇలాంటి ఆరోపణలతో ఉత్తరప్రదేశ్‌, రాజస్తాన్‌ల్లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లోకి ఒక ప్రైవేటు టీచర్‌ను అరెస్టు చేశారు. ఉద్యోగం నుంచి కూడా తొలగించారు.
అరెస్ట్‌ చేసిన ముగ్గురు కాశ్మీర్‌ విద్యార్థులను యుపి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పిడిపి అధినేత మెహబూబా ముఫ్తీ డిమాండ్‌ చేశారు. వారు క్యాంపస్‌లో భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయలేదంటూ ఆగ్రా కాలేజ్‌ అధికారులు ఇచ్చిన నివేదికను ఆమె ట్వీట్‌కు జోడించారు.
పాక్‌ విజయంపై సంబరాలు చేసుకుంటే దేశద్రోహం కేసులు : యోగి
టీ20 కప్‌లో పాకిస్తాన్‌ విజయంపై సంబరాలు చేసుకున్న వారి దేశద్రోహ చట్టం ప్రయోగిస్తామని గురువారం యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హెచ్చరించారు. 'పాకిస్తాన్‌ విజయాన్ని సంబరాలు చేసుకున్నవారు దేశద్రోహాన్ని ఎదుర్కోవాలి' అని యోగి ఆదిత్యనాథ్‌ అధికారిక కార్యాలయం తన ట్విట్టర్‌ పేజీలో పోస్ట్‌ చేసింది.
జమ్ముకాశ్మీర్‌లో ప్రభుత్వ ఉద్యోగి తొలగింపు
పాకిస్తాన్‌ విజయంపై వాట్సాప్‌ స్టేటస్‌ పోస్టు చేసిన జమ్ము డివిజన్‌ రజౌరి ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌లో ఆపరేషన్‌ థియేటర్‌ మహిళా టెక్నీషియన్‌ సాఫియా మజీద్‌ను గురువారం తొలగించారు.