Jul 03,2022 22:23

ఎంపిడిఒకు వినతిపత్రం ఇస్తున్న నంగా పద్మజ

శిలాఫలకంలో జెడ్‌పిటిసి పేరే లేదు..!
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో :
వైఎస్‌ఆర్‌ విలేజి క్లినిక్‌ శిలాఫలకంలో ఏడాదిక్రితం ఏకంగా జడ్‌పిటిసి పేరునే ఎత్తేశారు. సహించారు.. పోనీలే అని సరిపెట్టుకున్నారు. అప్పటినుంచి టిడిపి నుంచి వలసొచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తూ తనను పక్కన పెట్టడం ప్రారంభించారు. ఓర్పు నశించిన జడ్‌పిటిసి నంగా పద్మజారెడ్డి శనివారం ఎంపిడిఒ సుశీలదేవి దృష్టికి తీసుకెళ్లి. వైఎస్‌ఆర్‌ విలేజి క్లినిక్‌ శిలాఫలకంలో తన పేరు పెట్టకపోవడంపై వినతిపత్రం ఇచ్చారు. ఈ విషయమై ఎంత దూరమైనా వెళతానని 'మీడియా'కు తెలిపారు. దీంతో పాకాల వైసిపిలో గ్రూపుల వివాదం తారాస్థాయికి చేరినట్లయ్యింది.
పాకాలలో నంగా పద్మజారెడ్డి, ఎఎంసి ఛైర్మన్‌ మునీర్‌, ఇరంగారిపల్లి పంచాయతీ ఎంపిటిసి కస్తూరి పార్టీ పుట్టినప్పటినుంచి జెండా మోస్తూ వచ్చారన్నది వారి వాదన. అయితే ఇటీవల టిడిపి నుంచి వలసొచ్చిన నరేష్‌రెడ్డి, మునీశ్వర్‌రెడ్డిలను అధికార పార్టీ అందలమెక్కించారన్నది వారి ఆరోపణ. నరేష్‌రెడ్డిని మండల కన్వీనర్‌గా పదవి ఇచ్చారు. మునీశ్వర్‌రెడ్డిని సింగిల్‌విండో కన్వీనర్‌ను చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ మండలాన్ని శాసిస్తూ తొలినుంచి పార్టీ జెండా మోసిన వారిని పక్కన పెట్టడంతో రెండు గ్రూపులయ్యాయి. పాకాల మండలంలో పంటపల్లి పంచాయతీలోని వైఎస్‌ఆర్‌ విలేజి క్లినిక్‌ భవనం సంబంధించి శిలాఫలకాన్ని జడ్‌పిటిసి నంగా పద్మజారెడ్డి నిర్మించారు. అయితే ప్రధానమైన ముగ్గురి పేర్లు శిలాఫలకంలో లేకపోవడంతో విబేధాలు భగ్గుమన్నాయి. ఈ క్లినిక్‌ను 2021, జులైలో చంద్రగిరి నియోజకవర్గ ఎంఎల్‌ఎ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రారంభించారు. అప్పటినుంచి తనను పక్కన పెట్టడంతో మనస్తాపంతో శనివారం ఎంపిడిఒ సుశీలాదేవికి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నంగా పద్మజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రోటోకాల్‌ పాటించని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. న్యాయం జరగకపోతే ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమని చెప్పారు. తొలినుంచి పార్టీకి విధేయులుగా ఉన్న తమపై కక్షసాధింపు ధోరణి ఏంటని ప్రశ్నించారు. ఎంఎల్‌ఎ చెవిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని వాపోయారు.