Jan 16,2021 11:17

ముంబయి : టీమిండియా ఆటగాళ్లు హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్యలకు పితృవియోగం కలిగింది. వారి తండ్రి హిమాన్షు పాండ్య శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. సయ్యద్‌ ముష్తాక్‌ అలీ ట్రోఫీలో ఆడుతున్న కృనాల్‌ పాండ్య విషయం తెలియగానే ఇంటికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌ సిఇఒ శిశిర్‌ హతంగాడి మాట్లాడుతూ.. కృనాల్‌ పాండ్య వ్యక్తిగత సంఘటన కారణంగా బయోబబుల్‌ నుంచి ఇంటికి వెళ్లాడని తెలిపారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడాక తిరిగి భారత్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హార్దిక్‌ పాండ్య ఇంట్లోనే ఉండి ఇంగ్లండ్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌కు శిక్షణ పొందుతున్నాడు.