
తుళ్లూరు (గుంటూరు జిల్లా) : రాజధాని గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు పోరాట పటిమతో దశలవారీ ఆందోళనలు చేసి విజయం సాధించారని సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్.బాబూరావు అన్నారు. ఇబ్బందులు పెడుతున్న ఎలైట్ ఏజెన్సీని వదిలించుకొని నేరుగా సిఆర్డిఎ ద్వారా జీతాలు పొందే విధంగా చైతన్యంగా వ్యవహరించిన కార్మిక వర్గానికి జేజేలు పలికారు. ఐదు నెలల పెండింగ్ జీతాల కోసం తుళ్లూరు సిఆర్డిఎ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేస్తున్న కార్మికులను ఉద్దేశించి బుధవారం ఆయన ప్రసంగించారు. కార్మికుల ఆందోళనతో సిఆర్డిఎ అధికారులు, ప్రభుత్వం దిగొచ్చి ఒక నెల వేతనాన్ని జమ చేశారని తెలిపారు. పెండింగ్ వేతనాలు కూడా చెల్లించే ప్రక్రియ జరుగుతోందన్నారు. కార్మికులు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు మరింత చైతన్యంతో పోరాడాలని కోరారు. పారిశుధ్య కార్మికులతో పాటు రాజధానిలోని ఏ రంగంలో కార్మికులకు సమస్యలు వచ్చినా వారికి సిఐటియు అండగా నిలుస్తుందని తెలిపారు. కార్మికులకు జీతాలు ఇచ్చే విషయంలో చొరవ చూపిన మంత్రి బత్స సత్యనారాయణ, సిఆర్డిఎ కమిషనర్ లక్ష్మీ నరసింహంకు సిఐటియు తరఫున అభినందనలు తెలిపారు. కార్మికులకు పని భద్రత కల్పించే విధంగా సిఆర్డిఎ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. రిలే నిరాహార దీక్షలో ఉన్న కార్మికులకు, నేతలకు బాబూరావు మజ్జిగ ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, రాజధాని ఏరియా పారిశుధ్య కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షులు ఎం.రవి తదితరులు పాల్గన్నారు.