Jan 11,2021 21:02

న్యూఢిల్లీ : కపిల్‌ గుజ్జర్‌ ఈ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా నానుతోంది. ఎందుకంటే మతోన్మాదాన్ని నెత్తికెక్కించుకొని షాహీన్‌బాగ్‌పై కాల్పులు జరిపిన కపిల్‌ గుజ్జర్‌ జైలు నుండి బెయిల్‌పై రాగానే బిజెపి నేతలు తమ పార్టీలోకి ఆహ్వానించారు. కండువా కప్పి పార్టీ సభ్యత్వం ఇచ్చారు. కానీ ఈలోపు కపిల్‌ గుజ్జర్‌కు మరింత నేర చరిత్ర ఉందని వెల్లడైంది. దీంతో బిజెపిపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఇక కపిల్‌ గుజ్జర్‌ను పార్టీలో కొనసాగించడం పార్టీకే నష్టమని బిజెపి భావించింది. అతన్ని పార్టీ నుండి బహిష్కరించింది. పాపం కపిల్‌ గుజ్జర్‌ బిజెపి నేతలు ఏం చేయమని చెప్పారో అదే చేశాడు. అవి ఇప్పుడు బిజెపికి నేరాలుగా కనపడుతున్నాయి.
మోడీ ప్రభుత్వం ప్రజలపై రుద్దిన పౌరసత్వ సవరణ చట్టాలైన సిఎఎ, ఎన్‌ఆర్‌సిలను వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. నిరసనలు చేసేవారిని వారి వేషదారణతోనే గుర్తించాలంటూ మోడీ ఇచ్చిన ఆదేశాలను జాతీయవాదులమని చెప్పుకునే పలువురు నేతలతో పాటు కపిల్‌గుజ్జర్‌ కూడా పాటించారు. పరోక్షంగా ముస్లింలపై ద్వేషాన్ని (ఇస్లామోఫోబియా) వ్యక్తం చేయాలన్న నిగూఢమైన అర్థాన్ని డీకోడ్‌ చేసి మరీ కపిల్‌ అనుసరించారు. షాహీన్‌భాగ్‌కు షాక్‌నివ్వాలన్న అమిత్‌ షా వ్యాఖ్యలను మరీ సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించింది. అన్నట్లుగానే షాహీన్‌బాగ్‌కు షాక్‌ ఇచ్చారు. బుల్లెట్‌లా దూసుకుపోయే వ్యక్తి సమాధానంతోనే ఆందోళనకారులు దారికి వస్తారన్న యుపి ముఖ్యమంత్రి యోగి వ్యాఖ్యలు తనకే సూచించినట్లు భావించిన కపిల్‌ షాహీన్‌భాగ్‌లోని ఆందోళనకారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దేశద్రోహులను కాల్చిపారేయండన్న నినాదాన్నిచ్చిన కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆజ్ఞను శిరసావహించి షాహీన్‌బాగ్‌పై కాల్పులు జరిపారు. అంటే దేశద్రోహులను గుర్తించడం, వారిని తొలగించడం వరకు ఉన్న ఆదేశాలను కపిల్‌ గుజ్జర్‌ శ్రద్ధాభక్తులతో నేరవేర్చారు. దీంతో కపిల్‌పై పలు కేసులు నమోదయ్యాయి. పార్టీకి అనవసరం అనుకున్న బిజెపి ప్రణాళిక ప్రకారం..రహస్యంగా కపిల్‌ను వదిలించుకునేందుకు సిద్ధమైంది.
అయితే కపిల్‌గుజ్జర్‌ ఆప్‌ సభ్యుడు కావడంతోనే.. తమ పార్టీలో చేర్చుకోవడం లేదని బిజెపి నేతలు చెబుతున్నారు. ఇదే వాస్తవమైతే.. మరో కపిల్‌ విషయంలోనూ ఈ విధంగానే వ్యవహరించాల్సి వుంది. అయితే ఆయన ఆప్‌ సభ్యుడు మాత్రమే కాదు మంత్రి కూడా. ఇటీవలే పార్టీ తీర్థం పుచ్చుకున్న కపిల్‌ మిశ్రాను బిజెపి సాదరంగా ఆహ్వానించింది. కపిల్‌ మిశ్రాకు ఓకె చెప్పి పచ్చి హిందూత్వవాదిగా ప్రవర్తించిన కపిల్‌ గుజ్జర్‌కు మాత్రం బిజెపి నో చెప్పింది. ఎందుకంటే పూర్తిగా పార్టీ ప్రయోజనాల మేరకే.
ఢిల్లీలో శాంతియుత నిరసనలు హింసాత్మకంగా మారడానికి మౌజ్‌పూర్‌లో కపిల్‌ మిశ్రా చేసిన విద్వేపూరిత ప్రసంగమే కారణం. కపిల్‌ మిశ్రా అనేక సందర్భాల్లో మైనార్టీలపై విషాన్ని వెళ్లకక్కాడు. ఇప్పుడు ఆ క్వాలిఫికేషనే మిశ్రాను బిజెపి నెత్తిన పెట్టుకునేందుకు కారణమైంది. మొదట బిజెపి ఎంపి గౌతమ్‌ గంభీర్‌, ఢిల్లీ బిజెపి చీప్‌ మనోజ్‌ తివారీతో పాటు హోం మంత్రి అమిత్‌షాలు కూడా మిశ్రాపై విమర్శలు చేశారు. అయినప్పటికీ.. మిశ్రాకు ఇవి హిందూత్వవాది అనే ఇమేజ్‌ను తెచ్చిపెట్టడంలో.. బిజెపిలో కీలక నేతగా మారేందుకు ఏమాత్రం అడ్డు కాలేదు. ఢిల్లీలో కేజ్రీవాల్‌తో పోటీపడేందుకు బిజెపి తరపున సరైన వ్యక్తి లేకపోవడం కూడా మరో కారణం. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రికి తమ పార్టీ అభ్యర్థిగా మిశ్రా పేరును ప్రకటించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కరలేదు.

పార్టీకి ప్రయోజనం ఉంటేనే.. హిందూత్వవాదైనా.. బిజెపి సిద్ధాంతమిదే..

'కాషాయ' ఉగ్రవాదం
ఉగ్రవాద కార్యకలాపాలలో గుజ్జర్‌ ప్రత్యక్షంగా పాల్గొనడంతోనే బిజెపి ఆయనను పక్కన పెట్టేందుకు యత్నిస్తోంది. ప్రజలు కపిల్‌ గుజ్జర్‌ను షూటర్‌గా పేర్కొంటుండగా, బిజెపి అధ్యక్షుడు జెపి.నడ్డా అతన్ని ఉగ్రవాది అని పేర్కొన్నారు. ఆప్‌పార్టీపై దాడి చేసేందుకు కూడా గుజ్జర్‌ను పావుగా వాడుకున్నారు. పలువురు ఆప్‌నేతలతో గుజ్జర్‌ ఫొటోలు వైరల్‌ కావడంతో కేజ్రీవాల్‌ తన పార్టీలో ఉగ్రవాదులను కూడా చేర్చుకున్నారంటూ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. ఆప్‌ నేతలకు, ఆయనకు సంబంధాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు కూడా తేల్చారు. అయితే బిజెపి నేత ప్రగ్యాఠాకూర్‌పై కూడా ఉగ్రవాద ఆరోపణలు ఉన్నాయి. అవి నడ్డాకు అసౌకర్యం కలిగించలేదు. మసీదుపై బాంబు పేలుళ్లు, దాడుల కేసులో నిందితురాలిగా ఉన్న ప్రగ్యా ఠాకూర్‌ను ఎంపిగా ఎంచుకునేందుకు కూడా బిజెపి వెనుకాడలేదు. హిందువులు ఎప్పుడూ ఉగ్రవాదానికి పాల్పడలేరు అంటూ ప్రధాని మోడీ స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. నడ్డా ఇటువంటి ఆరోపణలు చేయడానికి కారణం లేకపోలేదు. గుజ్జర్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమ మెడకే చుట్టుకుంటుందని బిజెపి భయపడుతోంది.
గుజ్జర్‌తో పాటు పలువురు బిజెపి నేతలు కూడా షాహీన్‌బాగ్‌ ఆందోళనకారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. గోద్రా ఊచకోతను పునరావృతం చేస్తామని, ముస్లింలను సజీవంగా దహనం చేస్తామంటూ ప్రతిజ్ఞలు చేశారు. షాహీన్‌బాగ్‌లోని ముస్లిం నివాసాల్లోని మహిళలపై హిందువులు అత్యాచారం చేస్తారంటూ బిజెపి ఎంపి ప్రవేష్‌ వర్మ బహిరంగంగానే బెదిరించారు. ముస్లింలపై విద్వేషపూరిత ప్రసంగాలు చేసినప్పటికీ.. ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా వారు అధికారంలో కొనసాగేందుకు బిజెపి అనుమతిస్తోంది.
గత ఏడాది గుజ్జర్‌ బెయిల్‌పై విడుదలైన కొన్ని వారాల అనంతరం సోషల్‌మీడియాలో మితవాద వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఎప్పటికప్పుడు ఫాలోయింగ్‌ పెరిగిపోతోంది. ఇటీవల జామియా ఆందోళనకారులపై కాల్పులు జరిపిన వ్యక్తి రామ్‌భక్త్‌ గోపాల్‌ కూడా గుజ్జర్‌ అనుచరుడే. అతను కూడా ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో కాషాయ ఉగ్రవాదులు ఈ చర్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
జిహాదీలను వ్యతిరేకిస్తూ గుజ్జర్‌ పలువీడియోలను క్రమం తప్పకుండా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తుంటారు. తన ఫేస్‌బుక్‌ పేజ్‌ నిండా ఇస్లామోఫోబియోపై వీడియోలు, పోస్టులు ఉంటాయి. అలాగే ప్రధాని మోడీ, అమిత్‌షా, యోగిలపై ప్రశంసలతో నిండిపోయి ఉంటాయి. గుజ్జర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ వీరాభిమాని కూడా.. లవ్‌జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని ప్రవేశపెట్టిన యోగిసర్కార్‌పై దాడి చేస్తున్నపుడు.. విద్వేషపూరిత పోస్టులతో ఇటువంటి చట్టాలకు మద్దతు ఇవ్వాల్సిందిగా హిందువులను ప్రోత్సహిస్తున్న వారిలో గుజ్జర్‌ కూడా ఉన్నారు. అలాగే యోగి స్థాపించిన హిందూయువ వాహినిలో సభ్యుడు కూడా.
కపిల్‌ గత నేర చరిత్ర గురించి తెలియదని బిజెపి పేర్కొంటున్నప్పటికీ.. ఆ వివరణను అంగీకరించడం కష్టమే.. కపిల్‌ గుజ్జర్‌, రాంభక్త్‌ గోపాల్‌తో బిజెపికి ఉన్న సంబంధం, హిందూత్వ వాదులు.. గాంధీ హంతకుడు నాథూరామ్‌ గాడ్సేకు మధ్య ఉన్న సంబంధం లాంటిది. వారిని బహిరంగంగా ప్రశంసించలేరు. అలాగని రహస్యంగా ఉంచలేరు. రహప్యంగా వారిని ప్రశంసించినప్పటికీ.. బహిరంగంగా ఆమోదించనూలేరు. స్వీకరించనూలేరు. వాస్తవానికి.. పదవులు, అధికార హోదాలు లేకపోయినా.. ఈ మతోన్మాదులు అదేపిచ్చిలో అలాగే బతికేస్తారు.