Nov 23,2021 08:22

పాత పేపర్లు, పాత వస్తువులు కొనుక్కునే పాండూ వీధిలో నిలబడ్డాడు. ఇంటిలో ఉన్న ఒక్కొక్క పాత వస్తువు తెచ్చి ఇవ్వసాగింది వాణి. తాను తెచ్చిన వస్తువుల్లో పాత గొడుగు కనబడకపోవడంతో 'పాత గొడుగు ఎక్కడీ' అని అడిగింది పాండూని.
'మీ అబ్బాయి తీసుకొని ఆ ఇంటికి వెళ్లాడు' అన్నాడు పాండు.
'ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ఏయే వస్తువుతో ఆడుకోవాలో వీడికి తెలీడం లేదు' అని మనసులో అనుకొంది. పాండూ తనముందున్న వాటికి మొత్తం లెక్క వేసి డబ్బులిచ్చి వెళ్లాడు. చాలా సమయం తరువాత ఇంటికి వచ్చిన కొడుకు వైపు చూస్తూ ''ఒరేరు చైతన్యా.. పాతగొడుగు ఎక్కడీ'' అని అడిగింది.
'అమ్మా, ఎదురింటి ప్రమోద్‌ కోసం వెళితే, సహజక్క గొడుగు రిపేరు చేసింది' అన్నాడు చైతన్య.
'ఆ అక్కకు రేపు పరీక్షలు ఉందన్న సంగతి మరిచావా?' అని కోపంగా అంది వాణి.
'అమ్మా, ఆ అక్క నా చేతిలో ఉన్న పాత గొడుగును చూసి, ఎందుకు? అని అడిగితే విషయం చెప్పాను. నా దగ్గరున్న గొడుగు తీసుకుని బాగు చేసింది. పరీక్షలయ్యాక చెయ్యమని చెప్పినా వినలేదు. మంచిపని ఆలస్యం చెయ్యకూడదంటూ చేసిచ్చింది' జరిగిన సంఘటనని వివరించాడు చైతన్య.
'మంచి పని అన్నదా!.. ఎలా?' అనుమానంగా అడిగింది వాణి.
'పాతగొడుగు పాతసామానులవానికి ఇచ్చే బదులు దీన్ని బాగు చేస్తే, పక్కవీధిలో గుడి ముందు కూర్చొని భిక్ష మెత్తుకునే తాతకు ఎండ, వానకు ఉపయోగపడుతుం'దని చెప్పాను. 'మంచి పని' అంటూ సహజ అక్క మెచ్చుకుంది. నేనూ, ప్రమోద్‌ కలసి వెళ్లి ఆ తాతకు గొడుగు ఇచ్చాం' అని చెప్పాడు.
పాత వస్తువులు వృథా చేయకుండా బాగుచేసి, ఎదుటివారికి సహాయపడిన చైతన్యని చూసి తల్లి వాణి సంతోషించింది.
 

- ఓట్ర ప్రకాష్‌ రావు
97874 46026