Jul 25,2021 00:00
  • వర్షాలకు మరింత దెబ్బతిన్న రోడ్లు
  • బిల్లుల జాప్యంతో ముందుకు రాని కాంట్రాక్టర్లు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పలుచోట్ల రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. గతేడాది వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు కూడా చేయకపోవడంతో తాజాగా కురుస్తున్న వర్షాలకు మరింత అవి మరింత దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిన పరిస్థిలు ఏర్పడ్డాయి. కోవూరుారాజమండ్రి బ్రిడ్జి అప్రోచ్‌ల పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం నుంచి కొయ్యలగూడెం వరకు 30 కిలోమీటర్ల రోడ్డును దాటాలంటే రెండు గంటలకు పైనే పడుతుంది. అలాగే కర్నూలు జిల్లాలో దేవనకొండ నుంచి పత్తికొండకు వెళ్లే రోడ్డులో బ్రిడ్జి కుంగిపోయి ఆరు నెలలైనా మరమ్మతులకు నోచుకోకపోవడంతో 30 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్తున్నారు. అలాగే కర్నూలు బళ్లారి రోడ్డుపై ఏడాదిగా ఉన్న గొయ్యిలకు మోక్షం కలగలేదు. గుంటూరు నుంచి కర్నూలు రోడ్డులో గతేడాది వర్షాలకు ఏర్పడ్డ గుంతలు ఇంకా మరమ్మతులకు నోచుకోలేదు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు నిలిపేయడంతో ఇప్పుడు పనులు చేసేందుకు వారు కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొంది. గతేడాది వర్షాలకు దెబ్బతిన్న దాదాపు మూడు వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. రూ.2025 కోట్లతో ఎపిఆర్‌డిసి పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. వినుకొండ, కుంటల మధ్య రాష్ట్ర హైవేకు టోల్‌గేట్‌ను వసూలు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించడంతో ఆ పనులు మాత్రం యుద్ధ ప్రాతిపాదికన చేస్తున్నారు. మిగిలిన రోడ్లు, మరమ్మతుల పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో కేవలం రోడ్ల మరమ్మతుల కోసమంటూ పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.1 చొప్పున సెస్‌ వసూలు చేస్తున్నా... రోడ్ల మరమ్మతులు చేయకపోవడం సరికాదని ఆంధ్రప్రదేశ్‌ లారీ యజమానుల సంఘం నాయకులు వై.ఈశ్వరరావు 'ప్రజాశక్తి'తో అన్నారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతుల పనులు చేయాలని కోరారు.