తాడిపత్రిరూరల్ : పాత పీఆర్సీనే కొనసాగించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు నష్టం కలిగిస్తున్న జీవో ఎంఎస్ 07ను వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. 2013లో అమలు చేసిన పీఆర్సీ వేతనాలు, కరువు భత్యం, మధ్యంతర భతి అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఏడవ కమిషన్ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా చేసిన వాగ్దానం ప్రకారం అవుట్సోర్సింగ్లో ఉన్న మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం అధ్యక్షులు వన్నూరప్ప, మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్, మహబూబ్బాషా, మెప్మా ఆర్పీ యూనియన్ కార్యదర్శి మణిదీపిక, వరలక్ష్మి, సిఐటియు నాయకులు ఉమా గౌడ్, కెవిపిఎస్ నాయకులు రామ్మోహన్, నరసింహారెడ్డి, కార్మికులు నాయకులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్కు వినతిపత్రం సమర్పిస్తున్న మున్సిపల్ ఉద్యోగులు