May 16,2022 07:37

     సీరా ఎనభైల నించీ కవిత్వం రాస్తున్న సీనియర్‌ కవి. 1989లో లోహనది, 1994లో మరోదశ అనే కవితా సంపుటాలను ప్రచురించారు. దాదాపు పాతికేళ్ళ తరువాత సెల్ఫీ అనే ఈ కవితా సంపుటిని ప్రటించాడు. దీనిలోని అరవై కవితల్లో తన స్వీయ చిత్రాలనీ, తనలోని స్వీయ చిత్రాలనీ కవితలుగా పాఠకుల ముందు ఉంచుతున్నాడు.
    సెల్ఫీ అనే మాట మన దైనందిన జీవితంలోకి సెల్‌ఫోన్‌ ద్వారా ప్రవేశించి మన నిత్య వాడుకలో స్థిరపడిపోయింది. ఫోన్‌లో ఉండే ముందు కెమెరా ద్వారా మన్ని మనం ఫొటో తీసుకోవడమే సెల్ఫీ. మన ఒక్కళ్ళమే కావచ్చు. మనతో పాటు ఇంకెవరైనా ఉండొచ్చు. ఒక దశ్యం, ఒక సంఘటన ఏదైనా మనం సెల్ఫీగా తీసి పంపుకుంటాం. ఈ కవితా సంపుటికి పేరు సెల్ఫీ. మోటారు సైకిలు రియర్‌ వ్యూ అద్దం మీద వాలి తన్ని తాను చూసుకుంటున్న పిచ్చుక ఈ సంపుటి ముఖచిత్రం. యిది పిచ్చుక సెల్ఫీ / అద్దంలో. కానీ యిక్కడ కవి లేడు. కవి పిచ్చుక సెల్ఫీని మనకి చూపిస్తున్నాడు. ముఖచిత్రం గురించి ఈ మాటలు చెప్పడానికి కారణం ఏమంటే కవి వసీరా గత పాతికేళ్ళ కాలం అనే అద్దంలో తన్ని తాను తీసుకున్న సెల్ఫీయే ఈ కవితా సంపుటి. తాను లేని ఫోటో కాదు సెల్ఫీ.. తనతో పాటు చూపించేది సెల్ఫీ.
2006లో రాసిన దశ్యాలు కవితతో మొదలైంది ఈ సంపుటి.
'అంతటా కొత్త దృశ్యాలు కన్పిస్తున్నాయి.
మనుషులకు వెర్రెత్తి అమానవీయ ప్రకంపనలు
చందమామ భయంతో చెవులు మూసుకునే దృశ్యం
రైతులు తెల్లని నురుగులు కక్కుకుని మరణించడం'
... ఇలా అన్నీ భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఈ కవిత వెనక ఒక దశాబ్దపు వేదన వుంది. సరళీకరణ, ప్రపంచీకరణ పర్యావరణ విధ్వంసం యివన్నీ ఆ దశాబ్ద కాలాన్ని అల్లకల్లోల పరిచిన విషయాలు. ప్రపంచమంతా సంక్షేమం, ప్రజాస్వామ్యం, సమానత్వం అనే విలువలని ధ్వంసం చేస్తూ వున్న కాలం. మన దేశంలో మధ్య తరగతి/ కులాలు ఏవైనా ప్రపంచీకరణలో భాగమై తమ ఆర్థిక అవకాశాలను అంది పుచ్చుకుని జీవితాన్ని పెను మార్పులకీ మలుపులకీ తిప్పేసుకున్న కాలం. ప్రజా ఉద్యమాలు క్రమక్రమంగా క్షీణించి పోయాయి. కుల ఉద్యమాలూ, ప్రాంత ఉద్యమాలూ, మత ఉద్యమాలూ పెరిగి పెరిగి మత జాతీయవాదం అధికారం ఆక్రమించడానికి సన్నద్ధమౌతున్న కాలం అది.
'చమురు తెట్టు మీద తేలే చందమామ ప్రతిబింబం
సముద్రంలో మునిగిపోతూ గావు కేకలు పెట్టడం' విన్నాడు కవి. వ్యాకుల పడ్డాడు. భయపడ్డాడు. దృశ్యం మారాలని కలలు గన్నాడు.
'ధవళ కాంతుల హిమాలయాల నుండి
ఆకుపచ్చని లోయల నుండి
ధ్యానం వంటి స్వచ్ఛమైన వెన్నెల నుండి
దిగి వచ్చే జీవనోత్సవ నదీ ప్రవాహాల మీద
తెల్లని రెక్కలు విప్పి
మనుషులంతా హంసల్కె
ఎగిరే దృశ్యం కోసం కలగంటున్నాను' అని కల కన్నాడు.
మనం ప్రేమించినవన్నీ, యిష్టపడ్డవన్నీ మనం ఇష్టపడని ప్రేమించలేని విలువల దాడిలో ధ్వంసమైపోతున్నాయి. 'నా యారాడ కొండ'లో కోస్టల్‌ కారిడార్‌ ప్రకృతిని పాడు చేయడాన్ని ఎంతో హృద్యంగా చెపుతాడు. విశాఖ సముద్రంలోని యారాడ కొండ డాల్ఫిన్‌ ముక్కులా ఉంటుందంటారు. దాని పేరు కూడా డాల్ఫిన్స్‌నోస్‌ అన్నారు. కానీ కవి వసీరా దాన్ని సగం నీటిలో మునిగిన ఏనుగులా చూస్తాడు.
'ఒకప్పుడు స్వచ్ఛమైన సముద్రంలో
ఈదులాడిన ఏనుగు'
పారిశ్రామిక ప్రగతికీ ప్రాకృతిక సౌందర్యానికీ ప్రతీక ఇది. కానీ
'కాలి బాట రోడ్డు అయింది.
రోడ్డు విషవాయు ఫ్యాక్టరీల కారిడార్‌ అయ్యింది.
కారిడార్‌ రియల్‌ ఎస్టేట్‌ అయ్యింది.
రియలెస్టేట్‌ రాజదండమైంది.'
కోస్టల్‌ కారిడార్‌ కావచ్చు. సెజ్‌లు కావచ్చు. థర్మల్‌ విద్యుత్కేంద్రాలు కావచ్చు. పారిశ్రామిక ప్రగతిని ఆహ్వానించిన ప్రజలు ఎందుకు వీటిని వ్యతిరేకించారు. ఎందుకు వీటికి వ్యతిరేకంగా పోరాటాలు చేసారు. ప్రాణాలర్పించారు? ఎందుకు?
'కారిడార్‌ మొసలి తన నెత్తురు పీల్చేస్తుంటే
సగం తల సముద్రంలో ముంచి
కన్నీటి సమద్రమవుతోంది'
అందుకే
'అడవులు కదం తొక్కుతూ మైదానాల్లోకి వచ్చి
నగరాల్లో ఆక్సిజన్‌ రాజ్యాన్ని స్థాపించాలి' అంటాడు.
'పిడికెడు అన్నం చిన్న రొట్టి ముక్కా' అనేది గొప్ప కవిత. ఈ కవిత నడకలో ఒక సంగీతం వినిపిస్తుంది.
'కొన్ని కొడవళ్ళని కొన్ని నాగళ్ళనీ
కొన్ని పొలాలనీ కొన్ని గ్రామాలనీ
కొన్ని గుడిసెల్నీ కొన్ని మేడల్నీ
పిడికెడు అన్న చిన్న రొట్టి ముక్కా
కడుపులో దాచుకున్నాయి.'
పిడికెడు అన్నమే, చిన్న రొట్టి ముక్కే కానీ అవి మానవ జీవితాన్ని శాసించేవి. లోహనదిలో బియ్యపు గింజ మీద ఏమేమి చూపగలడో చెప్పిన కవి... యిక్కడ అన్నం రొట్టి కడుపులో దాచుకున్న అనంత శక్తినీ చూపిస్తున్నాడు. శ్రీశ్రీ మానవుడాలో మానవుడి గురించి ప్రేమతో చెప్పినట్టు కవి వసీరా అన్నం గురించీ రొట్టి గురించీ హెచ్చరికగా చెపుతున్నాడు.
'కష్టజీవుల కడుపు నిండా కనికరించే పోరు జెండాలు
భూమి కోసం భుక్తి కోసం
ఎర్రకోటని ధిక్కరించి ఎగరాల్సిందే ఎగరాల్సిందే' అని తిరుగు లేకుండా నినదిస్తున్నాడు.
'ఓ వెచ్చని కవిత' ఆహ్లాదంగా, పిల్లలు పాడుకునే ముక్తపదగ్రస్తంలా సాగిపోతుంది.
'ఉదయాన్నే మంచు తెరలతో
ఇంద్రజాలం చేసే సూర్యుడు
పాపం చెట్టు తొర్రలో ఇరుక్కున్నాడు
అది కూడా ఉడుత పిల్లల నోటికి పండై ..' అని మొదలు పెట్టిన ఈ కవిత ..
'ఒక ట్రాన్స్‌లో నిద్రపోతున్న పోయెమ్‌ మీదకి
నేనో కోతిలా దూకెయ్యవచ్చా
తప్పు కాదూ' అని బుగ్గలు నొక్కుకుని
'ఉడుతల మధ్య కూర్చుని కాలవలోకి తొంగి చూడ్డమే
పొయిట్రీ ఎంజారుమెంట్‌ ' అంటాడు.
రరర
ప్రజల పట్లా, ప్రజా పోరాటాల పట్లా, పర్యావరణం కవిత్వం పట్లా తన ప్రేమనీ ఆవేదననీ సెల్ఫీగా తీసి చూపించిన వసీరా ఈ సంకలనంలో తన అంతర్లోకాలతో కూడిన సెల్ఫీలని కూడా చూపిస్తాడు. భూ యజ్ఞం, అరణి, అన్నసారం, ఝంకారం, ఓంకారం, పాల సముద్రం, యోగనిద్ర, దివ్యకాంతులు, అమృత కాంతి, శింజాన మణి మంజీర మండిత శ్రీపదాంబుజముల.... ఈ ఆధ్యాత్మిక వైదాంతిక భాష మన్ని ఆశ్చర్య పరుస్తుంది.
ప్రజాపోరాటాలూ, విప్లవ ఆకాంక్షా, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి యివన్నీ ఒక చోట కుదిరేవేనా? కవి మారిపోయాడా? లేక ఈ బీజాలు ముందునించీ వున్నాయా అనే మీమాంస పాఠకుణ్ణి వెంటాడుతుంది. ఒక కవి లేదా ఒక రచయిత వర్తమాన సంక్షుభిత సమాజాన్ని అన్వేషించే పరికరాలలో అధి భౌతికత కూడా ఒక పరికరమా? లేక పలాయనమా? బహుశా 70-80లలో ఇలా రాసుంటే వేరుగా వుండేదనుకుంటా. ఇప్పుడు కాలం మారిపోయింది. త్రిపురనేని అన్నట్టు.. త్యాగాలు చాలా ఎక్కువ చేసాం. కానీ ఫలితాలు తక్కువ వచ్చాయి. ఈ మారిపోయిన కాలం కవుల్ని బహుశా రకరకాలుగా మార్చిందేమో!
'పర్వతాల మధ్య పరవళ్ళు తొక్కే గంగలోనూ
నీ సిగలోని హిమాలయాల ధవళ పుష్పాలలోనూ
ఏమిటవి? ఏమిటవి? నీవు మోగించే సుందర నాదమేనా?
పొరలు తొలగిస్తుంది. తెరలు తీసివేస్తుంది
మూతలు తెరుస్తుంది కిటికీలు తెరుస్తుంది
నీ తీయదనమే దేహాల జ్కెళ్ళలోకి వెన్నెలై
ఖైదీల శిరస్సుని ముద్దాడుతుంది
దేహము, ప్రాణము, ఆత్మ, ఈ అధిభౌతిక భాష మన గ్రామీణ ప్రజలకి చాలా ప్రీతి పాత్రమైన భాష. మారుమూల గ్రామాల్లో ఏదో ఒక శిథిలాలయంలోంచి కూడా భజనలు, కోలాటాలు చేసే గ్రామీణుల కంఠంలో యిది పొంగి పొర్లుతూ ఉంటుంది.
కానీ యిది కాదు. వ్యవస్థీకృతమైన కులం పైన ఆధ్యాత్మిక తాత్విక భావజాలంగా వచ్చిన దైవ భావన కులాలని కట్టలా కట్టడానికే గానీ కులాన్ని తోసి మతంగా వ్యవస్థీకృతం చేయలేదు. బహుశా మతం లేకపోవడంగా యిది మన బలం. కులంగా యిది మన బలహీనత. కానీ భౌతిక జీవితంలో కులాన్నీ, అధిభౌతిక జీవితంలో దైవ భావననీ అనుసరించే మన గ్రామీణ రైతుకీ వత్తి పనివారలకీ, ఎవరికీ యిది ఒక వైరుధ్యంగా ఒక చోట పొసగనివిగా తోచలేదు. అది మన సాంస్క ృతిక జీవితంలో ఒక వారసత్వపు ధారగా ప్రవహిస్తూనే ఉంది.
'ఈ మట్టే నేనుగా పుట్టాను
నేను మట్టిగా పెరిగాను
కేవలం మట్టి నన్ను అనేక పాత్రలుగా మలిచింది.
అనేక శిల్పాలుగా జీవితాలుగా కళలు మార్చింది
దృశ్యాదృశ్యాల్లో విస్తరించిన
మానస సరోవరంలోని కమలాల్లోకి
తీసుకెళ్ళి నాకు జోల పాడి నిద్రపుచ్చింది
మురిపించి మైమరపించింది.'
పొసగనివి అన్న మాట నిజమే. కానీ పొసుగుతాయి కూడా అన్న మాటా నిజమే. యిక్కడనించీ కవి తన సెల్ఫీ కెమేరాతో ఏమి చూపించబోతాడు?
'కాలం మీది వెలుగు చీకట్ల సప్త వర్ణాలు
నీ సముద్రపు కోక
నా ఊయలై ఊగుతుంటే
దాని ఝంకారం ఓంకారమౌతుంది
నీ ప్రేమ జోలలో వ్యాపించే నిదుర చీకట్లలో
ప్రపంచం క్రమంగా తనలోకి జారుకుంటుంది.'
పసి పిల్లలని కోక ఉయ్యాలలో నిదుర పుచ్చడం మనకి తెలిసిందే. సముద్రం, కోక ఊయలైంది. లోకం తనలోకి జారుకుంది.
అమ్మ అనే భావనని వైన వైనాలుగా చిత్రించాడు ఈ కవితల్లో అమ్మ ఆట అనే కవిత చూడండి.
'నీవు వికసించిన చోట
హృదయంలో అమృత ఆనంద దరహాసం
అది నరనరానా పాకుతుంది
రక్తకాసారంలో రమ్యనాదమై ఈదుతుంది
మనసే కాదు శరీరమూ నీ వశమై
ఆనందపరవశమౌతుంది'
గోదావరిని అమ్మగా భావిస్తూ ...
'నీ అందాన్ని వర్ణించడానికి
శంకరాచార్యునికైనా తరమా
నీపాదాల మీద పడి
నీ ఒడిలో పుట్టిపెరిగి కరిగిపోయే భాగ్యం ఇంకోసారి
అనుగ్రహించమని కోరుకోడా అమ్మా! కోరుకోడా '
సంధ్యాహారతిలో
'సహ్యాద్రి పర్వతాలతో సహా
నన్ను నీ చేతుల్లోకి తీసుకొని ముద్దాడు' అని తనకూ ప్రకృతికీ అభేదాన్ని చూపుతాడు.
కవి గోదావరి వాడు. సహజంగానే నదులు మనిషిని గాఢంగా ఆవహిస్తాయి. ఎక్కడికి వెళ్ళినా గోదావరి ఎదురౌతుంది అన్నట్టు చాలా కవితల్లో గోదావరి కనిపిస్తుంది.
కాలవ పక్కరోడ్డు కవితలో
'రోడ్డూ కాలువా ఒక దాని చేయి ఒకటి పట్టుకుని పరుగులు
సరుగుడు తోటల వద్ద హఠాత్తుగా ఆగిపోయి
రోడ్డూ కాలవా సంభ్రమంగా చూస్తుంటాయి.
మంచు కురిసే ఆకాశంలో కలిసిపోయిన
గోదావరి సాగర సంగమాన్ని '
ఎక్కడికెళ్ళిపోతావే లో ...
'గోదావరి మొల చుట్టూ కొబ్బరి గెలల మువ్వలు
గోదావరి తల మీద అరటి తోటల ఆకుపచ్చని శిరోజాలు
తోటల శిరోజాల చుట్టూ పాయల కాలువల రిబ్బన్లు
పాయ చివర సూర్యుడు పాపిట బిళ్ళ'
ఇలాంటి భావ చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆ ప్రాంతం తెలిసిన వాళ్ళకి దాన్ని కొత్తగా చూపిస్తాయి. ఈ కవితలన్నింటిలోనూ అంతర్లీనంగా ఉండిన ఒక సామాన్య విషయం చలనం అనుకుంటాను. భౌతికమైనదైనా అధిభౌతికమైనదైనా ఆధ్యాత్మికమైనదైనా ఒక చలనాన్ని దర్శించడం, చలనంలో తాను లయం కావాలని కోరుకోవడం కవి రహస్య వాంఛ. చలనాన్ని కవిత్వంగా సెల్ఫీగా చూపడం కవి నైపుణ్యం. ఎగిరే చేప పిల్ల, కొండ దిగే గోవుల గుంపులు, నర్తనం, ఊయల, కవి దీన్ని ఎంతో యిష్టంగా చెప్పాడు, ముంచేయడం, జారడం ... యిలా ప్రతి కవితలోనూ అనేక రకాల చలనాన్ని చూపిస్తాడు. జంగమ ప్రధానమైన రోదసి, గ్రహగోళాలు, ప్రవాహాలు, అంతరిక్షాలు వీటన్నిటితో పాటు మానవ జీవితం, ఏకాకి అయిన మనిషిలోని ఆంతరంగిక అంతరిక్షం దాని లోని విస్ఫోటనాలు అన్నీ చలనాత్మకత సంతరించుకున్నవే. చలనమూ పురోగతీ లేని సృజన అంటూ ఉండదు. మనిషి నిరాశకు లోనవుతాడు అంతా అయిపోయిందనుకుంటాడు. కానీ భౌతిక వాస్తవికత మానవ మస్తిష్కాన్ని కుదిపివేస్తుంటుంది. మన అనుభవాలు మన్ని ఏమైనా చేయనీ... ఆధ్యాత్మికతలోనో, ఆంతరంగిక ఆశలలోనో మనిషి తన్ని తాను సెల్ఫీ తీసుకుంటాడు.
'తేనెలో ముంచిన కవ్వాన్ని
చందమామలో చిలికితే
వచ్చిన తెల్లని వెన్నెల వెన్నముద్ద'
అంతేనా
'ఒక్కో యుగంలో ఒక్కో పేరుతో
మహా ప్రేమ మానవ రూపంలో అవతరిస్తుందా?
యుగాలతో సంబంధం లేకుండా
నిత్య సత్యంగా నీలోంచి నాలోంచి
సృష్టిలోంచి తొంగి చూస్తోందా?'
ఈ మహా ప్రేమే వసీరా కవిత్వం.
 

- అద్దేపల్లి ప్రభు
98489 30203