Nov 25,2021 11:43

ప్రజాశక్తి-మక్కువ : రాష్ట్రంలో మొత్తం తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇటీవలే  విడుదల చేసిన విషయం విదితమే. అయితే  స్థానిక రైతు భరోసా కేంద్రంలో పైరవీలు చూసిన వారికి పరిహారం ఎక్కువగా అందిందని అందులో భూమి లేని వారు శాతం ఎక్కువ ఉందని అర్హులైన రైతులు ఆరోపిస్తున్నారు. మండలంలోని దబ్బగడ్డ రైతు భరోసా కేంద్రంలో జరిగిన ఈ తంతుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ సహాయకులు పిస్థాయి తనచుట్టూ కొంతమందిని త్రిప్పుకొని వారు చెప్పిన వారికే పరిహారాలు అందిస్తున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో రైతు భరోసా పంపిణీ విషయంలో కౌలు రైతులకు ఇచ్చిన దాంట్లో కొంత పర్సంటేజీలు తీసుకున్నారన్న ఆరోపణలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. అదే తరహాలో  ప్రస్తుత గులాబ్ తుఫాన్ పంట నష్టపరిహారాలు కూడా నమోదు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో దాదాపు 150 వరకు రైతులు ఉన్నప్పటికీ వారిలో కొద్దిమంది మాత్రమే నష్టపరిహారాలు పొందినట్లు తెలిసింది. పంట నష్టపరిహారంలో చోటుచేసుకున్న ఈ వ్యవహారాలపై అధికారులు నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా వ్యవసాయ  సహాయకులు సాయికుమార్ను ప్రజాశక్తి వివరణ కోరగా కొన్ని పొరపాట్లు జరిగి ఉండడం వాస్తవమే కానీ పైరవీలు చేయలేదని అన్నారు.  పది రోజులలో అందరికీ పరిహారాలు అందేలా చూస్తామని ఆయన వివరించారు.