Jul 03,2022 22:48

ప్రజాశక్తి - ఏలూరు సిటీ
           పిల్లల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండా అన్నిచర్యలూ తీసుకుంటున్నామని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వారికి అందిస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని స్త్రీ శిశుసంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ కెఎవిఎల్‌.పద్మావతి అన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో నెలకొన్న సమస్యలను పూర్తిస్థాయిలో అవగాహన చేసుకుని వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఆపదలో ఉన్న మహిళలకు రక్షణ కవచంలా దిశా చట్టం ఉందని, దీనిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె ప్రజాశక్తి ముఖాముఖీలో పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
ప్రశ్న : జిల్లాలో ఐసిడిసి ప్రాజెక్టుల వివరాలు చెబుతారా?
జిల్లాలో మొత్తం 18 ఐసిడిఎస్‌ ప్రాజెక్టులున్నాయి. వాటిలో 18 మంది సిడిపిఒలు ఆయా ప్రాజెక్టులను నిర్వహిస్తున్నారు. తమ పరిధిలోని సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరిస్తున్నారు. వారి వద్ద పరిష్కారం కానీ సమస్యలుంటే నా దృష్టికి వస్తాయి.
ప్రశ్న : పౌష్టికాహార లోపం గల పిల్లలపై ఎలాంటి దృష్టి పెట్టారు?
పిల్లల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. అలాంటి పిల్లలను గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రత్యేక పౌష్టికాహారాన్ని అందించి వారిలో ఉన్న లోపాన్ని పోగొట్టేందుకు చర్యలు చేపట్టాము. దీనికి సంబంధించి ఆయా ప్రాజెక్టుల అధికారులకు ఆదేశాలు జారీ చేశాము. ప్రభుత్వం కూడా వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది.
ప్రశ్న : గర్భిణులు, బాలింతల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కరోనా కారణంగా రెండేళ్లుగా గర్భిణులకు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని వారివారి ఇళ్లకు అందించే ప్రక్రియను చేపట్టాము. ఈనెల ఒకటో తేదీ నుండి అంగన్‌వాడీ కేంద్రాల్లోనే వండి వడ్డించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ప్రభుత్వం ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏమిటంటే గర్భిణులకు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పౌష్టికాహారాన్ని తయారు చేసి వారికి నేరుగా అక్కడే వడ్డిస్తాము. ప్రభుత్వం అందించిన మెనూ ప్రకారం వారికి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నాము. వారిలో రోగనిరోధక శక్తిని పెంచడమే ప్రాథమిక ఎజెండాగా కార్యక్రమాలు చేపడుతున్నాము.
ప్రశ్న : చిన్నారులు, మహిళలు, విద్యార్థులు, యువతుల రక్షణ కోసం మీరు తీసుకునే చర్యలు?
మహిళా సాధికారత, మహిళా చట్టం అమలు వంటి అంశాలపై ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే దిశా చట్టాన్ని తీసుకొచ్చారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సామాజిక న్యాయం జరిగేలా చర్యలను ఐసిడిఎస్‌ విభాగం కూడా చేపడుతుంది.
ప్రశ్న : ఛైల్డ్‌ వెల్ఫేర్‌ నుండి చిన్నారులను దత్తత ఇచ్చే ప్రక్రియలో ఏమైనా సమస్యలున్నాయా?
కేంద్రీయ దత్తత కల్పన ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం దత్తత ప్రక్రియను పూర్తి నిబంధనలు ప్రకారం నిర్వహిస్తాము. బాలల సంరక్షణ అధికారులు సమక్షంలోని పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. గతం కంటే ఇప్పుడు పిల్లలను దత్తత స్వీకరించే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.
ప్రశ్న : అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహార సరఫరాలో ఇబ్బందులేమైనా ఉన్నాయా?
జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహార సరఫరా క్రమం తప్పకుండా, ఇబ్బందుల్లేకుండా సజావుగా సాగుతుంది. కొన్ని ప్రాజెక్టుల్లో పాలు సరఫరాలో కొంత ఆలస్యం ఏర్పడుతుంది. ఈ వారంలో దానిని కూడా అధికమించేందుకు చర్యలు చేపట్టాం. గుడ్లు సరఫరాతో పాటు, ఆ గుడ్లను వేరొకరు వినియోగించకుండా ఉండేందుకు వాటిపై ముద్రలు వేసి అందిస్తున్నాము.
ప్రశ్న : అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రాథమిక విద్యా బోధన ఎలా ఉంటుంది?
అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రాథమిక విద్యా బోధన మంచి సత్ఫలితాలనిస్తుంది. వారికి అందించిన పాఠ్యపుస్తకాలు కూడా ఎంతో విలువైనవి. కార్పొరేట్‌ స్థాయి కాన్వెంట్లు కంటే ధీటుగా విద్యాబోధన జరుగుతుంది. బాల్య దశలోని ప్రాథమిక విద్య చిన్నారులకు బలమైన పునాదిగా ఉంటుంది. అంగన్‌వాడీ కార్యకర్తలు కూడా బోధనలో ప్రత్యేక శిక్షణ పొంది అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు బోధిస్తున్నారు.
ప్రశ్న : జిల్లాలో దిశా చట్టం గురించి చెబుతారా?
ఆపదలో ఉన్న ఆడపిల్లలకు, మహిళలకు, విద్యార్థులకు దిశా చట్టం రక్షణ కవచంలా పనిచేస్తుంది. లక్షలాది మంది మహిళలు దిశా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఆపదలో ఉన్న సమయాల్లో పోలీసుల నుండి రక్షణ పొందుతున్నారు. ఇప్పటికే పోలీసు శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా అనేకమంది మహిళలకు రక్షణగా నిలిచింది. వారి సమస్యలను క్షేత్రస్థాయి నుండి పరిష్కరించింది. వన్‌స్టాప్‌ సెంటర్లలో ఆపదలో ఉన్న మహిళలకు, అభాగ్యులైన మహిళలకు రక్షణ కల్పిస్తున్నాము.