Oct 16,2020 20:06
పదేళ్లు పెరిగిన భారతీయుల ఆయుర్దాయం!

న్యూఢిల్లీ : 1990వ దశకం నుంచి భారతీయుల ఆయుర్దాయం దశాబ్ద కాలం పైగా పెరిగిందని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రాల మధ్య తీవ్రమైన అసమానతలు ఉన్నాయని ఆ బృందం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 200కి పైగా దేశాలు, ప్రాంతాల్లో మరణాలకు కారణమవుతున్న 286 కారణాలు, 369 వ్యాధులు, గాయాలపై అధ్యయనం చేసిన ఈ వివరాలను లాన్సెట్‌ జర్నల్‌ ప్రచురించింది. 1990ల్లో భారత్‌లో 59.6 సంవత్సరాలుగా వున్న సగటు ఆయుర్దాయం 2019 నాటికి 70.8 సంవత్సరాలకు పెరిగిందని పేర్కొంది. కేరళలో సగటు ఆయుర్దాయం 77.3 సంవత్సరాలు ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో 66.9 సంవత్సరాలుగా ఉంది. ఎక్కువమంది ప్రజలు అనారోగ్యంతో, వైకల్యంతో బాధపడుతూ మరిన్ని సంవత్సరాలు జీవిస్తున్నారని ఆ అధ్యయనం పేర్కొంది. ఈ పరిశోధకుల్లో గాంధీనగర్‌ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కి చెందిన శ్రీనివాస్‌ గోలి ఉన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ముదరడం, నివారించదగ్గ ముప్పు కారకాలైన హై బిపి, పొగాకు వినియోగం, వాయు కాలుష్యం వంటి వాటిని అరికట్టడంలో ప్రజారోగ్య వ్యవస్థ విఫలమవడం, మొత్తంగా జనాభాను కొవిడ్‌ వంటి తీవ్రమైన ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయని ఆ బృందం అభిప్రాయపడింది. అంటువ్యాధులు తగ్గినా, దీర్ఘకాలిక వ్యాధులు పెరగడం ప్రధానమైన పరిణామమని, భారత్‌తో సహా దాదాపు ప్రతి దేశంలోనూ ఇది కనిపించిందని అధ్యయన నివేదిక సహ రచయిత, వాషింగ్టన్‌ యూనివర్శిటీకి చెందిన అలీ మొక్దాద్‌ వ్యాఖ్యానించారు. భారతదేశంలో ప్రసూతి మరణాల రేటు గతంలో చాలా ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు అది తగ్గుతూ వస్తోందని అన్నారు. కార్డియోవాస్క్యులార్‌ వ్యాధులు గతంలో ఐదో స్థానంలో ఉండేవని, ఇప్పుడు తొలి స్థానానికి వచ్చాయన్నారు. కేన్సర్‌ రేటు కూడా పెరుగుతోందని పేర్కొన్నారు. 30ఏళ్ల కాలంలో దీర్ఘకాలిక వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయని తెలిపింది. ఊబకాయం, హైబిపి, వాయు కాలుష్య ముప్పు కారకాలు పెరగడం కోవిడ్‌ మరణాలు పెరగడానికి కారణమవుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మొత్తం మరణాల్లో 58శాతం మరణాలు అంటువ్యాధులు కాని వాటితో సంభవిస్తుండగా, ఇది 1990లో 29శాతంగా ఉండేది. గుండె వ్యాధులు, సిఓపిడి, మధుమేహం, గుండెపోటు, కండరాల్లో లోపాలు వంటి కారణాలతో గత 30 ఏళ్లలో భారత్‌లో ఎక్కువమంది మరణించారని అధ్యయనం పేర్కొంది. 2019లో భారత్‌లో మరణాలకు ప్రధాన కారణాల్లో మొదటి ఐదు స్థానాల్లో వాయు కాలుష్యం (10.67లక్షల మృతులు), హై బిపి (10.47లక్షలు), పొగాకు వినియోగం (10.23 లక్షలు), పోషకాహార లోపం (10.18 లక్షలు), మధుమేహం (10.12 లక్షలు) ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులను, సామాజిక అసమానతలను తగ్గించడానికి అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సివుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మనదేశంలో బాలల్లో, తల్లుల్లో పోషకాహార లోపం బాగా వుందని, ఇది తీవ్ర అనారోగ్యానికి, మరణాలకు ప్రధాన కారణంగా మారుతోందని అధ్యయనం పేర్కొంది. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో మొత్తం మరణాల్లో ఐదో వంతు వీటి కారణంగానే జరుగుతున్నాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే సామాజిక, ఆర్థికాభివృద్ధి ప్రాధాన్యతను గుర్తించాలని పరిశోధకులు తేల్చిచెప్పారు.