May 16,2022 22:05
  • గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో కలుపుతాం
  • కొల్లేరులో రీసర్వే : 'రైతు భరోసా' బహిరంగ సభలో ముఖ్యమంత్రి

ప్రజాశక్తి-ఏలూరు ప్రతినిధి : పదెకరాల వరకూ ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్తు రూ.1.50కే అందిస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఏలూరు జిల్లాలో ఉన్న గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో కలుపుతామన్నారు. కొల్లేరులో రీసర్వేకు ఆదేశాలిస్తామని, కొల్లేరులో రెగ్యులేటర్‌ నిర్మాణానికి జూన్‌లో శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి ఈ మేరకు హామీ ఇచ్చారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం తమదని, రైతులను అన్ని రకాలుగా ఆదుకునే దిశగా ప్రతి అడుగూ వేస్తున్నామని అన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో రైతు భరోసా నాలుగో ఏడాది మొదటి విడత సొమ్మును బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో ఆయన జమ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే రైతు భరోసా సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. నాలుగో ఏడాది మొదటి విడతగా ఒక్కో రైతు ఖాతాలో రూ.5,500 చొప్పున జమ చేశామని, ఈ నెల 31న కేంద్రం మరో రూ.రెండు వేలు జమ చేస్తుందని తెలిపారు. మొత్తం 50 లక్షల మందికిపైగా రైతులకు ఈ సొమ్ము జమవుతుందన్నారు. రెండో విడతగా అక్టోబర్‌లో రూ.నాలుగు వేలు, మూడో విడతలో జనవరిలో రూ.రెండు వేలు జమవుతాయని తెలిపారు. గడిచిన మూడేళ్లలో ఇప్పటి వరకూ రైతు భరోసా పథకం కింద రూ.23,875 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామన్నారు. చరిత్రలో లేనివిధంగా వివిధ పథకాల కింద రైతులకు లక్షా పది వేల 93 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు.

  • ఎవరి పాలన ఎలా ఉందో ఆలోచించండి

టిడిపి ఐదేళ్ల పాలన, ఈ ప్రభుత్వ మూడేళ్ల పాలన ఏ విధంగా ఉందో అంతా ఆలోచించాలని ముఖ్యమంత్రి కోరారు. వడ్డీలేని రుణాల కింద టిడిపి ఐదేళ్లలో రూ.782 కోట్లు ఇస్తే, మూడేళ్లలో 65 లక్షల మందికి రూ.1,282 కోట్లు ఇచ్చామన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికీ రూ.ఏడు లక్షలు ఇస్తున్నామని, సిసిఆర్‌సి కార్డు ఉన్న కౌలురైతుల కుటుంబాలకూ నష్టపరిహారం అందిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు రుణమాఫీపై మాట ఇచ్చి తప్పారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు వద్దన్న, వ్యవసాయమే దండగన్న, బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపిన వారికి రైతు గురించి మాట్లాడే అర్హత లేదని పేర్కొన్నారు. రుణమాఫీ చేస్తామని రైతులను గాలికొదిలేసిన చంద్రబాబును ప్రశ్నించని దత్తపుత్రుడు, ఎల్లోమీడియా... ఇప్పుడు రాద్ధాంతం చేస్తుండడం శోచనీయమన్నారు. రైతులకు అన్ని రకాలుగా మేలు చేస్తుంటే చంద్రబాబు దత్తపుత్రుడు రైతుల పరామర్శకు వెళ్తున్నారని పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి విమర్శించారు. సిసిఆర్‌సి ఉండి పరిహారం ఇవ్వని ఒక్క రైతును కూడా చూపించలేకపోయారన్నారు.

  • గణపవరంలో తీవ్ర ఆంక్షలు

సిఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు గణపవరంలో తీవ్ర ఆంక్షలు విధించారు. సిపిఎం మండల నాయకులు నారపల్లి రమణరావు, ఎం.పెంటారావు, గవర సత్యనారాయణతోపాటు యుటిఎఫ్‌ మండల నాయకులు ఎమ్‌డి.మౌలాలీని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. సిఎం కాన్వారు వెళ్లే మార్గంలో జనం ఇళ్లలోంచి బయటకు రాకుండా చేశారు. గణపవరంలో మొత్తం దుకాణాలను మూయించివేశారు. వారపు సంతను రద్దు చేయించారు.

  • ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ప్లకార్డుల ప్రదర్శన

ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ఉండి మండలం ఎన్‌ఆర్‌పి.అగ్రహారానికి చెందిన పలువురు మహిళలు సిఎం సభ మధ్యలో ప్లకార్డులు ప్రదర్శించారు. పోలీసులు వారి నుంచి ప్లకార్డులు లాగేసుకున్నారు. వారిని కూర్చోబెట్టారు.

  • ఉద్యోగం ఇస్తామని డబ్బులు తీసుకొని మోసగించారు

ఉద్యోగం ఇప్పిస్తామని, తన వద్ద డబ్బు తీసుకుని మోసం చేశారంటూ ఓ యువతి సిఎం కాన్వారు వద్దకు రావడంతో సిఎం ఆమెతో మాట్లాడారు. ఆమె సమస్యను పరిష్కరించాలని పోలీసులను ముఖ్యమంత్రి ఆదేశించారు.