
అనంతపురం : అనంతపురం జెఎన్‌టియు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈఏపీసెట్-2023 పరీక్ష ఫలితాలను పది రోజుల్లో విడుదల చేయనున్నట్లు పరీక్షల నిర్వహణ ఛైర్మెన్, జెఎన్‌టియు ఉపకులపతి జి.రంగ జనార్ధన, కన్వీనర్ సి.శోభాబిందు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వారు విలేకరులతో మాట్లాడుతూ ఈఏపీసెట్-2023 పరీక్షకు ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 2,24,724 మంది విద్యార్థులు, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలలో 90,573 మంది హాజరయ్యారని తెలిపారు . మొత్తం 3,15,297 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఈ సంవత్సరం ఈఏపీసెట్ 2023 పరీక్షల్లో అభ్యర్థుల ర్యాంకులు నిర్ణయించడానికి ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన కోర్సుల్లో గ్రూపు సబ్జెక్టుల్లో అభ్యర్థి పొందిన మార్కులకు 25శాతం వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు, ఇతర రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంటర్మీడియట్ ఒకేషనల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్‌జియుకెటి, రాష్ట్ర,జాతీయ స్థాయి ఓఎస్‌ఎస్ (ఓపెన్ స్కూల్ సిస్టం), సిబిఎస్‌ఇ పరీక్షల మార్కులను పరిగణనలోకి తీసుకోనున్నట్లు చెప్పారు. వీటి మార్కుల ఆధారంగా ఫలితాలు నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు సమర్పించిన వారి మార్కులను వెరిఫికేషన్ చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉందన్నారు. ఇంకా చాలా మంది విద్యార్థులు వారి మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉందన్నారు. వారందరూ వెంటనే ఇంటర్మీయడిట్ మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.