Feb 17,2022 23:19

డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు

- డాక్టర్‌ ఎన్‌.శాంతమ్మ
ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్‌ :
ఒక మహోన్నత సాహితీ వటవృక్షం ఆకస్మికంగా కూలిపోయిందని ఆయన లేని లోటు సాహితీ లోకానికి తీర్చలేనిదని రచయిత్రి డాక్టర్‌ ఎన్‌.శాంతమ్మ అన్నారు. ప్రముఖ సాహితీవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆశావాది ప్రకాశరావు గురువారం పెనుకొండలోని తన నివాసంలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారన్నారు. కవి, అవధాని, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకులుగా ఆయన గుర్తింపు పొందారు. తెలుగు పద్యానికి, అవధానానికి, వర్తమానకాలంలో ప్రసిద్ధుడైన ఆశావాది వందల అవధానాలు దేశవ్యాప్తంగా చేశారన్నారు. అనేక గ్రంధాలు రాశారని, కవిగా, వక్తగా, రచయితగా, సాహితీ కార్యకర్తగా, విద్యావేత్తగా ప్రముఖ అవధానిగా అనంత సాహితీ వనంలో ఏపుగా పెరిగిన పెద్ద సాహితీ వటవృక్షంగా నిలిచారన్నారు. ఆయన సాహిత్య ప్రయాణంలో 'పద్మశ్రీ' సైతం ఆయన్ను వెతుకుంటూ వచ్చిందన్నారు. ఎందరో రెక్కలు రాని సాహితీ విహంగాలకు గూడునిచ్చి, నీడనిచ్చి, రెక్కలు తొడిగి ఎగిరేటట్లు చేసిన మహోన్నత ఆచార్యుడాయన అన్నారు. డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు సాహితీ సేవలు చేసేందుకు తనకు స్ఫూర్తినిచ్చారన్నారు. తెలుగు సాహిత్యంలో తెలియని ఎన్నో విషయాలను బోధించి సందేహాలను తీర్చిన గురువులాయన తన ప్రతి రచనా పుస్తక రూపానికి రావడానికి ప్రధాన కారకులు. నాకు దైవమిచ్చిన సోదరులు. పరమ సౌజన్య మూర్తి. మంచితనానికి, మానవత్వానికి ప్రతీక ఆశావాది. ఆయన ఆకస్మిక మరణం మా అందరికీ పెను విషాదాన్ని మిగిల్చింది. భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని ప్రార్ధిస్తున్నాను.