May 01,2022 06:30

'అన్యాయం, అక్రమాలు...దోపిడీలు, దురంతాలు/ ఎన్నాళ్లని ఎన్నేళ్లని నిలదీసినదీ రోజు/ అణగారిన శ్రమశక్తిని ఆవేశం ఊపిరిగా/ కదిలించినదీ రోజు... రగిలించినదీ రోజు/ నేడే మేడే... మేడే మేడే..' అంటాడు కవి అదృష్టదీపక్‌. ప్రపంచ శ్రామికోద్యమ చరిత్రలో మేడే కు ఒక ప్రత్యేకత, ప్రాముఖ్యతా వున్నాయి. జీవించే హక్కు సాధన కోసం లక్షలాది మంది శ్రమజీవుల రక్తతర్పణల నుంచి... వందలాది మంది బలిదానాల నుంచి ప్రభవించిన అరుణోదయం మేడే. ఇది దీక్షా దినం. కార్మిక హక్కుల కోసం సాగించే పోరాట దినం... బతుకుదెరువు కోసం పరిక్రమించే కష్టజీవుల ఉద్యమాల దిక్సూచి మేడే. ఈ త్యాగపూరిత ఉద్యమాలు, పోరాటాల నుంచి ఆవిర్భవించిందే ఎర్రజెండా. శ్రమ జీవులకు ఎక్కడ కష్టాలు వచ్చినా అక్కడ ఎగురుతుంది ఎర్రజెండా. చికాగో నగర వీధుల్లో చిందిన కార్మిక నెత్తురు చేతనమై నిలిచింది. చిరకాలపు దోపిడిపై సాగిన తిరుగుబాటు బావుటా ఎగిరింది. బిగి సడలని ఆ పిడికిళ్లు... తడియారని ఆ నెత్తురు నుంచి మొలకెత్తిన ఎర్రజెండా... నేడు ప్రపంచవ్యాప్తంగా వాడవాడలా ఎగురుతోంది శ్రామిక జన సారథిగా. వారి కళ్లలో ప్రజ్వరిల్లే అంతులేని విశ్వాసం... ఆ కండరాల్లో బిరబిర ప్రవహించే ఆవేశం... గులకరాయి నుంచి గుండు సూది మొదలు... ఆకాశ హర్మ్యాలను నిర్మించే వరకూ అన్నింటికీ కార్మికుడే మూలం. వారి శ్రమశక్తే ఇంధనం. ఆ విలువను గుర్తు చేసుకోవాల్సిన రోజు నేడు... మేడే.
ఇది యాదృచ్ఛికంగా ఏర్పడిన రోజు కాదు. చారిత్రక పరిణామాల క్రమంలో దోపిడీ, పీడన, అణచివేతలపై కార్మికవర్గం జరిపిన సుదీర్ఘ పోరాటాల ఫలితం. ఎనిమిది గంటల పనిదినం కోసం జరిగిన పోరాటాల నేపథ్యంలో 1886 ఏప్రిల్‌లో అనేక చోట్ల సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి. వాటి కొనసాగింపుగా మే 1న అమెరికా అంతటా ఒకరోజు సమ్మె నిర్వహించాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం ఆ సమ్మెను అణచివేసేందుకు పూనుకుంది. చికాగో నగరంలో మే 3వ తేదీన శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న కార్మికులపై పోలీసులు కర్కశంగా దాడి చేశారు. కొందరిని అరెస్టు చేశారు. ప్రతిఘటించినవారిపై అమానుషంగా కాల్పులు జరిపారు. అనేకమంది కార్మికులు మృతి చెందారు. ఏడుగురు కార్మిక నేతలు ఉరికంబమెక్కారు. ఎందరో కార్మికుల రక్త తర్పణతో, బలిదానాలతో సాధించుకున్న 8 గంటల పని దినం నేడు పూర్వపక్షం చేయబడుతోంది. పని భారం, పని గంటల పెరుగుదల, స్వదేశీ, విదేశీ బడా కార్పొరేటు ఆర్థిక శక్తుల ప్రయోజనాల కోసం కార్మిక చట్టాలను సైతం సవరిస్తున్నారు. నయా ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా...కార్పొరేట్లు ప్రపంచమంతా విస్తరిస్తున్నారు. కుగ్రామంగా మారిన ప్రపంచంలో సంపద ఒకవైపు గుట్టలు పడుతుంటే...మరోవైపున పేదరికం పేరుకుపోతోంది. కరోనా సమయంలోనూ సంపద మరింత పెరిగితే.... కార్మికులు, ఉద్యోగులపై పని ఒత్తిడి రెండింతలైంది. వర్క్‌ ఫ్రం హోమ్‌ పేరుతో పనిభారం, కార్పొరేట్ల దోపిడీ మరింత పెరిగింది. ఇది గృహిణులకు సైతం అదనపు భారంగా మారింది.
కార్మికవర్గం పోరాడి సాధించుకున్న హక్కులపై పాలక వర్గాలు తమ దాడిని వేగవంతం చేశాయి. పలు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు నేటికీ హక్కులు దక్కడం లేదు. అనేక పోరాటాల ద్వారా కనీస వేతనాలు, పనిగంటలకు సంబంధించిన జీవోలు విడుదల చేసినా వాటిని ఇంకా అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో 'అంతర్జాతీయ కార్మిక దినోత్సవం' మేడే మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ నయా ఉదారవాద విధానాలను తిప్పికొట్టడానికి రైతాంగం, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు, ఇతర శ్రామిక వర్గాలన్నిటినీ కలుపుకొని కార్మికవర్గం ఉద్యమాలకు కదిలించాలి. 'మా నిరసనలు ధ్వనించకుండా మీరు మా గొంతులు నులిమేస్తున్నారు. కానీ మా శ్రామికవర్గం మౌనమే అంతకు మించిన శక్తిగా మారి...మిమ్మల్ని ఎదిరించే రోజు తప్పక వస్తుంది' అని నాటి ఉద్యమ నేత ఆగస్ట్‌ స్పైస్‌ తనను ఉరి తీయబోయే ముందు గర్జించాడట. ఈ వ్యాఖ్యను స్ఫూర్తిగా తీసుకొని నేటి కార్మిక వర్గం పెట్టుబడిదారీ వర్గాన్ని కూల్చే తమ చారిత్రక బాధ్యతను నిర్వర్తించవలసి వుంది. 'పదండి ముందుకు/ పదండి తోసుకు/ కదం తొక్కుతూ కదలండి' అంటాడు మహాకవి శ్రీశ్రీ. ప్రపంచానికి శ్రమ విలువను చాటి, చీకటిలో చిరుదివ్వెలు వెలిగించిన ఈ రోజే ప్రతిజ్ఞా దినం కావాలి.