Oct 16,2020 18:43
పేదల ఇళ్లకు మోక్షమెప్పుడో..!

నిరుపేదల సొంతిటి కల ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. రాజకీయ కక్షసాధింపుల్లో పేదలు సమిధలుగా మారుతున్నారు. ఎపిటిడ్కో ఆధ్వర్యంలో గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు ప్రారంభానికి నోచుకోక రెండేళ్ల నుంచి ఖాళీగా శిథిలమైపోతున్నాయి. జిల్లాలోని నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, కావలి, ఆత్మకూరు,నాయుడుపేట, సూళ్లూరుపేట పట్టణాల్లో సుమారు రూ.3887 కోట్లతో 58,235 ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 47,504 ఇళ్లు పనులు ప్రారంభం కాగ, 17,415 ఇళ్లు పూర్తయ్యాయి. వైసిపి అధికారంలోకి వచ్చాక ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా నిలిపేసింది. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో మూలనపడేసింది. ఇళ్లకోసం లబ్ధిదారుల వాటా కింద సుమారు రూ.92 కోట్ల వసూళ్లు చేశారు. అప్పులుచేసి చెల్లించిన డబ్బుకు అప్పులు కట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత భారీ ప్రాజెక్టు రాజకీయ కక్షల కారణంగానే పక్కన పెట్టారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతూ సింహపురి పౌరహక్కుల సంఘం పేరుతో పోరుకు సిద్ధమవుతున్నారు.


ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఒక కల. పెరుగుతోన్న పట్టణీకరణతో నిరుపేదల అద్దె ఇళలకే పరిమితమవుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశపెడుతున్నా పేదలకు అందడం లేదు. 2006 అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కొత్తూరు వద్ద 90 ఎకరాల్లో 5500 మంది ఇందిరమ్మ ఇళ్లను మంజూరుచేశారు. వైఎస్‌ఆర్‌ నగర్‌ పేరుతో ఒక్కోక్కరికి 9 అంకణాలు స్థలం ఇచ్చారు. అక్కడే ఇళ్ల నిర్మాణం కోసం ఏర్పాట్లు చేశారు. ప్రీప్రాఫిగేటెడ్‌ ఇళ్ల కోసం విదేశాల నుంచి కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. అది కార్యరూపం దాల్చలేదు. నాయకులు ఆక్రమ సంపాదనకు పేదల ఇళ్లు పణంగా పెట్టారు. పేదల ఇళ్లపేరుతో కోట్ల రూపాయాలు దిగమింగారు. అక్కడ కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం మాత్రం మరిచిపోయారు. అప్పటి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పేదల ఇళ్ల పేరుతో భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడడంతో పేదలకు సొంతిటి కల పూర్తికాలేదు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చాక పట్ణ్ణణ ప్రాంతాల్లో స్థల సమస్య సాకుగా చూపించి అపార్ట్‌మెంట్లు నిర్మాణం చేపట్టారు. ఎపి టిడ్కో ఆధర్యంలో జిల్లాలోని నెల్లూరు కార్పొరేషన్‌, గూడూరు, కావలి, వెంకటగిరి, ఆత్మకూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టారు. జిల్లావ్యాపితంగా 58,235 ఇళ్లను మంజూరుచేశారు. ఇందుకోసం రూ.3887 కోట్లు ఖర్చుపెట్టడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అందులో భాగంగా ఇప్పటి వరకు రూ.1366 కోట్లు ఖర్చుపెట్టారు. 2019 ఫ్రిబవరిలో ప్రారంభమైన ఈ ఇళ్లను ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందజేయలేదు. టిడిపి ఈ ఇళ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడిందని రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రాజెక్టును వైసిపి ప్రభుత్వం పక్కన పెట్టింది. ఎక్కడ పనులు అక్కడే నిలిపేసి కంపెనీలు వెళ్లిపోయాయి. అక్కడ ఉన్న స్టీల్‌, ఇతర సామాగ్రి తుప్పుపట్టిపోయింది.


58 వేల ఇళ్లు..రూ.3887 కోట్లు..!
పట్ణణ ప్రాంతాల్లో పేదల సొంతింటి కల నెరవేర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టాయి. మూడు దశల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. నెల్లూరు నగరంలో 35,112 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వెంకటేశ్వరపురంలో రూ.328 కోట్లతో 4800 ఇళ్లను పూర్తి చేశారు. రెండో దశలో అల్లీపురంలో, అక్కచెరువుపాడు, కల్లూరుపల్లి, కొండ్లపూడిలో 8880 ఇళ్లను రూ. 1341 కోట్లతో చేపట్టారు. గూడూరు పట్టణంలో గాంధీనగర్‌ ప్రాంతంలో రూ. 341 కోట్లతో 5103 ఇళ్లు, ఆత్మకూర పట్టణంలో నెల్లూరు పాళెం వద్ద రూ.63 కోట్లతో 1028 ఇళ్లు, గూడూరు గాంధీనగర్‌లో రూ.47 కోట్లతో మరో 751 ఇళ్లు, నెల్లూరు పాళెం వద్ద రూ.59 కోట్లతో మరో 938 ఇళ్లు, కావలి పట్ణణపరిదిలోని జమ్మిపాలెం వద్ద రూ.254 కోట్లతో 4000 ఇళ్లు, నాయుడుపేట సమీపంలోని బిరదవాడలో రూ.181 కోట్లతో 2742 ఇళ్లు, సూళ్లూరుపేట మన్నారుపోలూరు వద్ద రూ.121 కోట్లతో 1851 ఇళ్లు, వెంకటగిరి చెవిరెడ్డిపల్లి వద్ద రూ.204 కోట్లతో 3200 ఇళ్లు.నెల్లూరు నగరంలో పేజ్‌ -3 కింద వెంకటేశ్వరపురంలో , కొండ్లపూడి, ఇరుకళపరమేశ్వరి దేవాలయం వద్ద రూ.714 కోట్లతో మరో 10112 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. జిలా వ్యాపితంగా 58,235 ఇళ్లను ప్రభుత్వం మంజూరుచేసింది. ఇందుకోసం రూ.3887 కోట్లు కేటాయించింది. ఇందులో 47,504 ఇళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు రూ.1366 కోట్లు ఖర్చుపెట్టారు. 17,415 ఇళ్లు పూర్తి చేశారు. ఇందులో లాటరీ పద్ధతి ద్వారా 48,571 మందికి ఇళ్లను కేటాయించారు. తాళాలు ఇచ్చారు. ఇంత జరిగినా పేదలకు మాత్రం ఇప్పటి వరకు ఇళ్లు దక్కలేదు.


లబ్ధిదారుల వాటా రూ.92 కోట్లు..!
సొంతింటి కల నెరవేరుతుందనే ఆశలో పేదలు ఇళ్ల కోసం తమ వాటాగా చెల్లించాల్సిన మొత్తం చెల్లించారు. ప్రభుత్వం లబ్ధిదారుల జాబితా తయారుచేసి, లాటరీ పద్ధతి ద్వారా ఇళ్లను కేటాయించారు. వెంకటేశ్వరపురంలో 2019 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబునాయుడు ఇళ్లను ప్రారంభించి తాళాలు చేతికిచ్చారు. పేదల సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. తమ ఇళ్లను చూసుకొని మురిసిపోయారు. ఎన్నో ఏళ్ల నుంచి కన్న కలలు నిజమౌతున్నాయని సంబరపడ్డారు. వారి ఆశ అడియాసే అయింది. జిల్లాలో లబ్దిదారుల వాటా క్రింద కొంత మొత్తం చెల్లించాల్సి ఉండడంతో అప్పులు చేసి కట్టారు. నెల్లూరు నగరంలో రూ.40.79 కోట్లు, ఆత్మకూరులో రూ.3.12 కోట్లు, కావలిలో రూ.19.22 కోట్లు, గూడూరులో రూ.11.07 కోట్లు, నాయుడుపేటలో రూ.6.33 కోట్లు, సూళ్లూరుపేటలో రూ.5.09 కోట్లు, వెంకటగిరిలో రూ.6.80 కోట్లు మొత్తంలో రూ.92 కోట్లు జమచేశారు. ఈ నగదు ప్రస్తుతం బ్యాంకుల్లో మూలుగుతోంది. తమకు ఇళ్లు వద్దని వెనక్కి తీసుకోడానికి అవకాశం లేదు. ఇళ్లు చేతికి రాక, కట్టిన డబ్బు వెనక్కి రాక పేదల లబోదిబోమంటున్నా ఈ ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయింది.


శిథిలమవుతోన్న ఇళ్లు..!
జిల్లాలో నిర్మించిన పేదల ఇళ్లు శిథిలమవుతున్నాయి. జిల్లా వ్యాపితంగా 17 వేల ఇళ్లు పూర్తయినా రెండేళ్ల నుంచి పంపిణీ చేయలేదు. వెంకటేశ్వరపురంలో 4800 ఇళ్లు పూర్తి చేశారు. ఎవరూ పట్టించుకోక పోవడంతో పశువుల కొట్టాల్లా మారుతున్నాయి. అకతాయిలు ఇళ్లలోని అద్దాలు పగులగొట్టడం, పాములు పుట్టలు పెట్టడంతో శ్మశాన వైరాగ్యం కనిపిస్తోంది. టిడిపి చేసిన పనులను అడ్డుకోవడమే పనిగా పెట్టుకుంటున్న వైసిపి పేదల ఇళ్లను రాజకీయంగా వాడుకుంటుందనే విమర్శలున్నాయి. ఇప్పటికే రెండేళ్ల గడిచిపోయింది. పేదలకు ఇళ్లుపంపిణీ చేయాలని కోరుతూ ఇప్పటికే అనేక సార్లు ఆందోళనలు నిర్వహించారు. నేడు సింహపురి పౌరసమైఖ్య అధ్వర్యంలో వెంకటేశ్వరపురం ఎన్‌టిఆర్‌ హౌసింగ్‌ వద్ద జరిగే అందోళనలో పట్టణ పౌరసమైఖ్య రాష్ట్ర నాయకులు బాబురావు పాల్గొననున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ తీరు మారుతుందో లేదో చూడాలి.