Aug 07,2022 22:23

ఫొటో :మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌

ఫొటో :మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌
పేదల పక్షపాతి ఎరుకలయ్య..
- నివాళులర్పించిన సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌
ప్రజాశక్తి-మర్రిపాడు :  కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మిక, పేద ప్రజల ఆశా జ్యోతి ఎరుకలయ్య 3వ వర్థంతి సందర్భంగా ఇస్కపల్లిలోని స్థూపం వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పడే సమస్యలను తెలుసుకొని జిల్లా కమిటీ సహకారంతో ఉద్యమాలు నిర్వహించేవారన్నారు. మండలంలో భూసమస్యలు, సోమశిల హై లెవెల్‌ కెనాల్‌ సాధనకు, సారాయి ఉద్యమంలో పాల్గొని పార్టీ కోసం పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వారికి తమ సహాయసహకారాలు అందించి అనేకప్రజా ఉద్యమాలలో ముందుండి పోరాటాలు చేసేవారని తెలియజేశారు. దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కష్ట జీవులు పేద ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తుందని విమర్శించారు.
దళితులు, మైనారిటీలపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. మిలిటరీలో కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ బిజెపి కార్యకర్తలు నియమించేందుకు ప్రయత్నిస్తోందని తెలియజేశారు. రాజ్యాంగాన్ని కూడా తమకు అనుకూలంగా మలచుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడానికి బిజెపి కారణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉపాధి కూలీలకు డబ్బులు రాలేదని, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదని రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి రావలసిన రూ.300 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదన్నారు. అనంతరం రైతు సంఘం నాయకులు చండ్ర రాజగోపాల్‌ మాట్లాడుతూ మండలంలో 2వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయని, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘంరాస్ర కార్యదర్శితో కలిసి పేదలకు భూములను పంచామన్నారు. భూములు ఖాళీగా ఉన్ననూ, పేదలకు పంపిణీ చేయలేదన్నారు. వ్యవసాయ, కార్మిక, వ్యవసాయ కూలీలు, పేదల సమస్యలపై ఎరుకల నిరంతరం పోరాటం చేసి చివరి వరకు పార్టీలోనే ఉండి ఎర్ర జెండా కప్పించుకొని మృతి చెందారన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా సమస్యలపై పోరాటం చేసేవారని అందరూ ఎరుకలయ్యను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ సంతాప సభలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి రషీద్‌, నెల్లూరు రూరల్‌ సిపిఎం శాఖ కార్యదర్శి బత్తల కష్ణయ్య, మండల సిపిఎం కార్యదర్శి రహంతుల్లా సిఐటియు కార్యదర్శి రత్నయ్య ఐదవ మండల కార్యదర్శి శ్యామలమ్మ, అధ్యక్షురాలు మూలి ప్రమీల, నందవరం రామానాయుడు పల్లి శాఖ నాయకులు మహమ్మద్‌ గౌస్‌ సుధాకర్‌, రామయ్య, వైసిపి నాయకులు జయరామ్‌రెడ్డి, కుటుంబ సభ్యులు సిపిఎం కార్యకర్తలు సానుభూతిపరులు పాల్గొన్నారు.