May 29,2023 21:19

ఆదోనిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పేదలను మోసం చేసేందుకే అని ఆదోని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి విమర్శించారు. వైసిపి అధ్యక్షులు జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి అధ్యక్షతన భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైసిపి కార్యాలయం నుంచి వైఎస్‌ఆర్‌ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్‌టిఆర్‌ బతికుండగా వెన్నుపోటు పొడిచి టిడిపి పగ్గాలను అక్రమంగా లాక్కొని చంద్రబాబు దొడ్డి దారిన ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకున్నారని విమర్శించారు. 2014 ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని 700 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి, ఏ ఒక్క హామీ నెరవేర్చలేక మేనిఫెస్టో కాపీని టిడిపి వెబ్‌ సైట్‌లోనూ తొలగించారని తెలిపారు. రాజమండ్రిలో టిడిపి నిర్వహించిన మహానాడులో కూడా ఆరు హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారని, ఆరింటిలో నాలుగు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్నారని చెప్పారు. మిగతా రెండు పక్క రాష్ట్రం కర్ణాటక కాంగ్రెస్‌ మేనిఫెస్టో నుంచి కాపీ కొట్టారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండి చంద్రబాబు కుయుక్తలకు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జగన్మోహన్‌ రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు. వైసిపి యువనేత జయమనోజ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌, వైసిపి పట్టణ గౌరవాధ్యక్షులు చంద్రకాంత్‌ రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ బోయ శాంత, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ దేవదాసు, వైస్‌ ఛైర్మన్‌ నరసింహులు, వైసిపి జిల్లా కార్యదర్శి వెల్లాల మధుసూదనశర్మ, ఎన్‌.చంద్రశేఖర్‌ రెడ్డి, కౌన్సిలర్లు రఘునాథరెడ్డి, ఫయాజ్‌ అహ్మద్‌, రాజేశ్వరరెడ్డి, బాలాజీ, చలపతి, చిన్న, మల్లికార్జున, మధుబాబు, రెహమాన్‌, మాధవ రెడ్డి, కిట్టు పాల్గొన్నారు.