Sep 14,2021 23:46

పేదలు సాగు చేసుకుంటున్న భూమిలో మొక్కలు నాటుతున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు

ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి
వ్యకాసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు డిమాండ్‌
ప్రజాశక్తి -కర్నూలు హాస్పిటల్‌: 
కర్నూలు జిల్లా కల్లూరు మండలం దూపాడు గ్రామంలో 139 సర్వే నెంబర్‌లోని ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని, అన్యాక్రాంతమైన భూమిని రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. దూపాడులో పేదలు సాగు చేసుకుంటున్న భూములను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి.నారాయణ ఉపాధ్యక్షుడు కె.వెంకటరాముడుతో కలిసి అయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 139 సర్వే నెంబరులో 65 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా, అది క్రమంగా అన్యాక్రాంతం అయిందన్నారు. 2008లో దూపాడు గ్రామ పేదలు మాకు భూములు కావాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జెండాలు పాతిసాగు చేసుకున్నారు. పట్టాలు ఇస్తామని మోసం చేసిన అధికారులు, రియలేఎస్టేట్‌ వ్యాపారులకు కట్టబెడుతున్నారని అన్నారు. స్థానిక శాసనసభ సభ్యులకు పేదలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారికి పట్టాలు మంజూరు చేయించాలని అన్నారు. ప్రజాప్రతినిధులు ఉండేది పేదల కోసమా, కబ్జా దారులకోసమా తేల్చుకోవాలని అన్నారు. పేదలకు పట్టాలు ఇచ్చేదాక పోరాడతామని అన్నారు. ఇటీవల నిరవధిక ఆందోళన సందర్భంగా తహశీల్ధార్‌ వచ్చి పేదలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. హామీ నిలబెట్టుకోవాలని అన్నారు. పర్యటనలో సంఘం మండల నాయకులు శ్రీనివాసులు, హరిబాబు, ఏకాంబరి గ్రామ మహిళలు పాల్గొన్నారు.