Nov 25,2021 10:10

ముంబయి : బాలీవుడ్‌ ప్రేమ జంట కత్రినాకైఫ్‌, విక్కీ కౌశల్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇందుకుగాను రాజస్థాన్‌లో రెండు వివాహాలను ప్లాన్‌ చేశారట..! రెండు వివాహాలేంటి ? అనుకుంటున్నారా.. ఒకటి కోర్టు వివాహం-మరొకటి రాజరిక వివాహం. రణతంబోర్‌ సమీపంలోని రిసార్ట్‌లో తమ రాజరిక వివాహం కోసం జైపూర్‌కు వెళ్లే ముందు విక్కీ, కత్రినా వచ్చే వారం ముంబైలో కోర్టు వివాహం చేసుకుంటారని కత్రినా సన్నిహిత వర్గాలు తెలిపాయి. అందుకే రెండు వివాహాలకు సన్నద్ధమయ్యారు. రాజస్థాన్‌లో వారి రాయల్‌ వివాహ ఆచారాలకు ముందే విక్కీ, కత్రినా ముంబైలో కోర్టు వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. కత్రినా, విక్కీ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సీక్రెట్‌ గా ఉంచాలని అనుకుంటున్నారట. అందుకనే ఇంకా పెళ్లి విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించలేదని సమాచారం. ప్రస్తుతం కత్రినా సినిమాల నుండి విరామం తీసుకున్నారు. ఈ లవ్‌ బర్డ్స్‌ ఈ ఏడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకుంటారనే వార్త బాలీవుడ్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ జంట డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చినప్పటికీ వారు స్పందించలేదు. త్వరలో ఈ ప్రేమజంట ముంబైలో కోర్టు వివాహం చేసుకోబోతుంది. అసలు కోర్టు వివాహమేంటీ అనుకుంటున్నారా ? కోర్టు మ్యారేజ్‌ కు రిజిస్టర్‌ మ్యారేజ్‌ కు మధ్య తేడా ఏంటి ?

కోర్టు వివాహం అంటే..
తమ కులం లేదా మతానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా అర్హులైన మగ, ఆడ జంటకు కోర్టు, వివాహ అధికారి (రిజిస్ట్రార్‌ / మేజిస్ట్రేట్‌), ముగ్గురు సాక్షుల సమక్షంలో పెళ్లి చేస్తారు. పెళ్లి చేసుకునే జంట న్యాయవాది సహాయంతో కోర్టు వివాహం చేసుకుంటారు.

కోర్టు వివాహానికి అర్హతలేంటంటే... వధువు వయస్సు కనీసం 18 సంవత్సరాలుండాలి. వరుడి వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి. వివాహ సమయంలో ఇద్దరూ ఎలాంటి మానసిక రుగ్మతతో బాధపడకూడదు. భారత సర్వోన్నత న్యాయస్థానం 2006 లో చట్టం దఅష్టిలో అన్ని వివాహాలను నమోదు చేయడాన్ని తప్పనిసరి చేసింది. జీవిత భాగస్వామితో సంబంధాన్ని నిరూపించడానికి ఇది ముఖ్యమైన ధ్రువీకరణ పత్రంగా మారింది. అంటే దీనికి చట్టపరమైన భద్రత ఉంటుంది. విడాకులు తీసుకోవడం మాత్రం కష్టం.

రిజిస్ట్రర్‌ మ్యారేజ్‌ అంటే ?
సంప్రదాయ వివాహం చేసుకున్న తర్వాత వివాహ ధ్రువీకరణ పత్రం పొందడానికి, జంటలు చెల్లుబాటు అయ్యే పత్రాలను సమర్పించి రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తమ వివాహాన్ని నమోదు చేసుకోవాలి. దీన్నే రిజిస్టర్‌ మ్యారేజ్‌ అంటారు.

కోర్టు మ్యారేజ్‌ కు రిజిస్టర్‌ మ్యారేజ్‌ కు మధ్య తేడా ?
రిజస్ట్రర్‌ మ్యారేజ్‌లో.. వివాహ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ అనేది ఇద్దరు వివాహం చేసుకున్నట్లు తెలిపే అధికారిక సాక్ష్యం.
కోర్టు మ్యారేజ్‌లో.. అర్హులైన జంట ముగ్గురు సాక్షుల సమక్షంలో ఒకరినొకరు వివాహం చేసుకోవచ్చు. ఆ ఇద్దరు తప్పనిసరిగా భారతీయ పౌరులుగా ఉండాలనేది కూడా తప్పనిసరి కాదు. ఒక భారతీయ వ్యక్తి, ఒక విదేశీ వ్యక్తి కూడా ఉండవచ్చు.