
ప్రజాశక్తి-బాపట్ల రూరల్: ఉద్యోగుల పెండింగ్ పీఆర్‌సి బకాయిలు వెంటనే విడుదల చేయాలని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ సిహెచ్ సురేష్ బాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యమ కార్యాచరణ మేరకు వర్క్ టూ రూల్ పాటిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం కలెక్టర్ కార్యాయం వద్ద జిల్లా సర్వే డిపార్ట్‌మెంట్, స్టాటిస్టికల్ సివిల్ సప్లయీస్, రెవెన్యూ, సమాచార శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ట్రెజరీ కార్యాలయ ఉద్యోగులతో నల్ల రిబ్బన్లు ధరించి 5 గంటలకల్లా విధులు ముగించి నిరసన ప్రదర్శనతో మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని కార్యాలయాలకు తిరిగి అందరు ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొని ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు పనులు నిలిపివేయాలని కోరారు. కలెక్టరేట్ యూనిట్ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ మహబూబ్ బాషా, ఆర్ సుమంత్ మాట్లాడుతూ ఉద్యోగులందరూ ఐకమత్యంగా ఉండి మన మన హక్కులను, మనకు రావలసిన బకాయిలను సాధించుకుందామని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించే వరకూ ఈ పోరాటం ఆగదని తెలిపారు. ఉద్యోగుల పెండింగ్, ఇతర బకాయిలు వెంటనే విడుదల చేయాలనన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేసి సిపీఎస్ పెన్షన్ పథకాన్ని రద్దు చేసి రాష్ట్ర ఉద్యోగులు అందరికీ పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు కేటాయించిన బడ్జెట్‌లోని మొత్తాలను సకాలంలో ఎందుకు చెల్లించదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఏపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా సహధ్యక్షులు బి సుశీల, జిల్లా ప్రచార కార్యదర్శి డి అర్జున్, జిల్లా కోశాధికారి బి ఓంకార్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, కె విజరు, జి అనిత, కె సత్యమంగలాంబ, మాధురి, రేఖ, యమున తదితర డిపార్ట్‌మెంట్ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.