Jul 21,2021 21:05

లిమా : పెరూ అధ్యక్షుడిగా పెడ్రో కేస్టిలోని ప్రకటించడం పట్ల లాటిన్‌ అమెరికా దేశాలు, అంతర్జాతీయ సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రజల అభిష్టాన్ని మన్నించి, ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణకు తీసుకున్న చర్యను మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయల్‌ లోపెజ్‌ ఒబ్రాడర్‌ అభినందించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ ఎజెండా కోసం సాధ్యమైనంత త్వరలో ప్రాధాన్యతలను నిర్వచించుకోవాల్సిందిగా ఆయన కోరారు. వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురో కూడా అభినందన సందేశం పంపారు. ప్రజల నిర్ణయంతో 'ఆశ, న్యాయం, సమానత్వం' దిశగా పెరూ పయనం సాగించాలని మదురో ఆకాంక్షిస్తున్నారని వెనిజులా విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్వీట్‌ చేసింది. పెడ్రోకి, పెరూ ప్రజలకు శుభాభినందనలని అర్జెంటైనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్‌ తెలిపారు. బలీవియా అధ్యక్షుడు లూయిస్‌ అరెస్‌ పెరూ ప్రకటనను స్వాగతించారు. తన కర్తవ్య నిర్వహణలో పెడ్రో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ స్టేట్స్‌ (ఒఎఎస్‌) కార్యదర్శి లూయిస్‌ అల్‌మాగ్రో హర్షం వ్యక్తం చేస్తూ పెరూ ప్రభుత్వంతో తమ సంబంధాలు బలోపేతం కాగలవని అన్నారు. లిమాలోని అమెరికా ఎంబసీ కూడా అభినందనలు తెలియజేసింది. పెరూతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు చిలీ విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.