Jan 25,2022 21:39

కోవిడ్‌

       అనంతపురం ప్రతినిధి : జిల్లాలో కోవిడ్‌ మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ఈనెల 24 అధికారిక లెక్కల ప్రకారం 40.99 శాతం పాజిటివిటీ రేట్‌ వచ్చింది. 25వ తేదీ లెక్కల ప్రకారం 27 శాతం నమోదవడం గమనార్హం. ఇంత పెద్ద సంఖ్యలో రెండో దశలో కూడా కేసులు లేవు. ఈసారి మాత్రం కేసులు అత్యధికంగా జిల్లాలో నమోదవుతున్నాయి. అయితే ఆరోగ్యపరమైన సమస్యలు కొంత తక్కువగా ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశంగా ఉంది. దీంతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది.
జిల్లాలో ఈనెల 24వ తేదీన పట్టణం, గ్రామీణ ప్రాంతాలు రెండూ కలిపి మొత్తం 3928 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1610 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంటే 40.99 శాతం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల వారీగా చూస్తే పట్టణ ప్రాంతాల్లో 1845 మందికి కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 845 మంది పాజిటివ్‌ అయ్యారు. 46.35 శాతం పాజిటివ్‌ అయ్యారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే 2106 మందికి వైద్య పరీక్షలు చేస్తే 765 మంది అయ్యారు. 36.32 శాతం పాజిటివ్‌ అయ్యారు. ఇక మంగళవారం నాడు చూస్తే 4964 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 1345 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక్కడ కూడా పట్టణ ప్రాంతాల్లో కాస్త ఎక్కువ మంది పాజిటివ్‌ అయిన వారిలోనున్నారు. ప్రస్తుతానికి జిల్లాలో 8469 కేసులు యాక్టివ్‌గానున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదయినా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు మాత్రం కేవలం 75 మందే ఉండడం కాస్త ఉపశమనాన్ని ఇచ్చే అంశంగా ఉంది. ఇందులో 65 మంది నాన్‌ ఆక్సిజన్‌ బెడ్‌ మీదనే ఉన్నారు. కేవలం పది మంది మాత్రమే ఆక్సిజన్‌ బెడ్‌పై ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఐసియులో లేనట్టు అధికారులు చెబుతున్నారు. ఇది కాస్త ఊరటనిచ్చే అంశమని చెప్పొచ్చు.
నిర్ధారణలో జాప్యం
జిల్లాలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో తీరని జాప్యం జరుగుతోంది. కోవిడ్‌ లక్షణాలతో బాధపడే వారి నుంచి నమూనాలు సేరించిన తరువాత ఫలితాలు రావడానికి మూడు, నాలుగు రోజులు సమయం పడుతోంది. వాస్తవానికి నమూనాలిచ్చిన 24 గంటల్లోపు ఫలితాలిచ్చేందుకు అనుగుణమైన సౌకర్యాలున్నాయి. ఆరు వేల వరకు ఒకే రోజు ఫలితాలిచ్చేందుకు జిల్లాలో వీలుంది. కాని ఇప్పుడు నాలుగు వేల వరకు మాత్రమే వస్తున్నాయి. ఫలితాలొచ్చేలోపు కొంత మంది నెగటివ్‌ కూడా అయిపోతున్నారు. అనంతపురం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇదే రకంగా ఫలితాలొచ్చిన ఘటనలున్నాయి. కోవిడ్‌ ఫలితాలను మరింత వేగవంతంగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.