Nov 26,2021 07:44
  • ఆదాయ లోటు 40,828 కోట్లు,
  • ద్రవ్య లోటు 49,756 కోట్లు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రోజురోజుకూ రాష్ట్రంలో లోటు పెరిగిపోతోంది. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువవుతుండటంతో ఆదాయ లోటుతోపాటు ద్రవ్య లోటు కూడా ఆందోళనకరంగా మారుతోంది. బడ్జెట్‌లో అంచనా వేసిన లోటుకు, ప్రస్తుత లోటుకు మధ్య అంతరం ఊహకు అందని విధంగా కనిపిస్తోంది. ఇది ఆందోళనకరమని ఆర్ధికశాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
తాజాగా సిద్ధం చేసిన గణాంకాల ప్రకారం ఆదాయ లోటు 40,828 కోట్లుగా ఉండగా, ద్రవ్య లోటు 49,756 కోట్లకు చేరుకుంది.
వాస్తవానికి అయితే బడ్జెట్‌లో ఆదాయ లోటును రూ. 5 వేల కోట్లుగా, ద్రవ్యలోటును రూ. 37 వేల కోట్లుగా అంచనాలు రూపొందించారు. ఇందుకు భిన్నంగా ఆదాయ లోటు రూ. 35 వేల కోట్లు అదనంగా నమోదవ్వగా, ద్రవ్యలోటు కూడా అదనంగా 12,700 కోట్లకు పెరిగింది. ఇది అసాధారణ పెరుగుదలగానే అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆదాయం మాత్రం గణనీయంగా మెరుగైంది. అక్టోబర్‌ చివరి వరకు అన్ని రంగాల ఆదాయం కలిపి రూ. 75,332 కోట్లు రాగా, గత ఏడాది అక్టోబర్‌ వరకు కేవలం రూ. 56,798కోట్లు మాత్రమే వచ్చింది. అంటే రూ. 19 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చినట్టయింది. ఇక మొత్తం వ్యయం రూ. 1,25,110 కోట్లు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో రెవెన్యూ వ్యయమే రూ. 1,16,160 కోట్లుగా ఉండగా, పెట్టుబడి వ్యయం రూ. 8,739 కోట్లు చేయగలిగారు. కాగా అక్టోబర్‌ వరకు చేసిన రుణాలు 49,756 కోట్ల రూపాయలు. బడ్జెట్‌లో రూ. 37,029 కోట్లు రుణాలుగా తీసుకునేందుకు ప్రతిపాదించగా కేవలం ఏడు నెలల్లోనే అంచనాలు దాటిపోయి అదనంగా రూ. 12 వేల కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు తేలింది.