Jun 11,2021 21:08

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని ధర్నా

ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్‌, యంత్రాంగం
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ప్రజలపై పెట్రోల్‌, డీజిల్‌ ఛార్జీలను పెంచి భారాలు మోపుతోందని కాంగ్రెస్‌ బిసి సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుల్లెట్‌ రవి విమర్శించారు. పెనుమూరు మండల కేంద్రం పెట్రోల్‌ బంక్‌ వద్ద నిరసన తెలిపారు. దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో నిత్యావసర సరుకులు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. నెలరోజుల వ్యవధిలోనే ఇరవై సార్లు పెట్రోల్‌, డీజిల్‌ ఛార్జీలు పెంచారన్నారు. సామాన్యుని ఆగ్రహానికి గురైన బిజెపి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దొడ్డాపురం బాల, తోకల కేశవులు, యుగంధర్‌, రామమూర్తి పాల్గొన్నారు.
దేశంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్‌ వంద రూపాయలకు చేరిందని కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ 2014లో ముడిచమురు ధరలు భారీగా ఉన్నా పెట్రోల్‌ 71, డీజిల్‌ 50 రూపాయలుగా ఉండేదన్నారు. ఇపుడు ముడిచమురు ధరలు తగ్గినా పెట్రోల్‌ ధర వందకు చేరిందన్నారు. ఈకార్యక్రమంలో వంశీకృష్ణ, రవి పాల్గొన్నారు. బిఎన్‌ కండ్రిగలో టిడిపి, సిపిఐ ఆధ్వర్యంలో ఆటోను తాడుతో లాగుతూ పెట్రోల్‌ బంక్‌ నుంచి మెయిన్‌రోడ్డు వరకు నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతూ 'సంక్షేమం' పేరుతో అకౌంట్లలో డబ్బులు వేస్తూ జనాన్ని మోసం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుధాకర్‌నాయుడు, కన్నయ్యనాయుడు, మాజీ జడ్‌పిటిసి సునీత, కత్తి ధర్మయ్య, కత్తి రవి పాల్గొన్నారు. నగిరిలో యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు బివి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలని ద్విచక్రవాహనాన్ని రిక్షా మీద ఎక్కించుకుని నడుపుకుంటూ పిసిఎన్‌ హైస్కూల్‌ నుంచి ఓంశక్తి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డగించడంతో కొంతసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించేంత వరకూ ఆందోళన విరమించేది లేదని నేతలు హెచ్చరించారు.