Oct 14,2021 01:01

దీక్షల్లో పాల్గొన్న ఎపి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ హమాలీలు

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో, కలెక్టరేట్‌
పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌ సంస్థలకు వరాలివ్వడమే మోడీ దేశభక్తి అని సిఐటియు గోపాలపట్నం జోన్‌ ప్రధాన కార్యదర్శి బి.వెంకటరావు విమర్శించారు. విశాఖ కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 195వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలనుద్దేశించి వెంకటరావు మాట్లాడుతూ, దేశభక్తి ముసుగులో మోడీ ప్రభుత్వం స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలకు దేశ సంపద, సహజవనరులను కట్టబెడుతోందని విమర్శించారు. నరేంద్రమోడీ అనుసరిస్తున్న కార్మిక, రైతు ప్రజావ్యతిరేక విధానాలను పోరాటాలు ద్వారానే నిలువరించగలమన్నారు. ఈ దీక్షల్లో పాల్గొన్న పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో గల ఏపి బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు చెందిన హమాలీలను ప్రజాశక్తి బ్యూరో పలుకరించగా తీవ్రస్థాయిలో ప్రభుత్వాల తీరును దుయ్యబట్టారు.
కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం తగునా : చిన్నారావు
''ఇన్ని రోజులుగా కార్మికులు, ఉద్యోగులు, ప్రజానీకం ప్రైవేటీకరణ వద్దని నిరసనలు తెలియజేస్తుంటే ఏ ప్రభుత్వమైనా వినకుండా ఉంటుందా? ఈ బిజెపి ప్రభుత్వానికి ఎందుకింత పట్టు. దేశంలో ప్రజలు, కార్మికవర్గం కంటే కార్పొరేట్‌ సంస్థలే ఎక్కువైపోయాయా? ఓట్లు వేసింది ప్రజలా? కార్పొరేట్లా? ఎవరికోసం పరిపాలన చేస్తారు? స్టీల్‌ప్లాంట్‌ ఉంటేనే విశాఖ నగరం అభివృద్ధి అని అన్ని తరగతుల ప్రజానీకం నెలల తరబడి ఘోషిస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకింత మంకు పట్టుపడుతోంది'' అంటూ చిన్నారావు అనే హమాలీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నిసార్లయినా దీక్షల్లో పాల్గొంటాం
''మోడీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ప్రైవేటీకరణను విరమించుకునేంత వరకూ మేం దీక్షలకు హాజరవుతాం. మేం పలుసార్లు హాజరై సంఘీభావం తెలిపాం. ఇంకా ఎన్నిసార్లయినా పాల్గొంటాం' అని హమాలీలు గవర మహేష్‌, జి.ఈశ్వరరావు, పి.జగదీష్‌, పి.వెంకటరావు ఏకకంఠంతో ఉద్ఘాటించారు.
మా సంస్థను నిర్వీర్యం చేస్తున్నారు : ఎస్‌.మారయ్య
ప్రభుత్వ రంగంలో ఉండే స్టీల్‌ప్లాంట్‌ను ఎలాగైతే కుట్రలు చేసి ప్రైవేటీకరించాలని చూస్తున్నారో జెర్రిపోతులపాలెంలోని ప్రభుత్వ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ (స్టాక్‌ పాయింట్‌)ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని హమాలీ ఎస్‌.మారయ్య తెలిపారు. ప్రభుత్వ కార్పొరేషన్‌కు రావాల్సిన 4వ సర్కిళ్ల పరిధిలోని సుమారు 50 షాపులను అనకాపల్లి, ఆనందపురంలోని ప్రైవేట్‌ డిపోల్లో కలిపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి ప్రైవేటు డిపో పరిధిలో 141, ఆనందపురం డిపో పరిధిలో 65 షాపులు, 100 బార్‌లు ఉంటే జెర్రిపోతుల పాలెం ప్రభుత్వ డిపో పరిధిలో గతంలో 150 షాపులు ఉంటే నేడు 73 షాపులు (తగ్గించేశారు) ఉన్నాయని పేర్కొన్నారు. లోడింగ్‌, అన్‌లోడింగ్‌కు హమాలీకి కనీస కూలి రూ.500 ఉండగా, ప్రస్తుతం కూలీ రూ.300కు పడిపోయిందని తెలిపారు. కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా అందరం ఏకం కావాలి. అందుకే స్టీల్‌ప్లాంట్‌ రక్షణ నినాదం మమ్మల్ని అందరినీ, తోటి కార్మికులనూ కదిలిస్తోంది అని ఆయన పేర్కొన్నారు.