Jan 17,2022 22:28

నిరసన తెలుపుతున్న ఫ్యాప్టో నాయకులు

ప్రజాశక్తి-ఎమ్మిగనూరు : మెరుగైన పిఆర్‌సి ఫిట్‌మెంట్‌, సిపిఎస్‌ రద్దు కోసం ఈనెల 20న చేపట్టే కలెక్టరేట్‌ ముట్టడిని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య తాలూకా కన్వీనర్‌ కరె కృష్ణ, యల్లప్ప, బసవరాజు, ఖాసీంజీ, మాదన్న కోరారు. సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక వీవర్స్‌ కాలనీ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరె కృష్ణ మాట్లాడారు. 11వ పిఆర్‌సి ఫిట్‌మెంట్‌ను ఐఆర్‌ 27 శాతం కంటే మెరుగైన ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని కోరారు. చీఫ్‌ సెక్రటరీ ఇచ్చిన పిఆర్‌సి నివేదికను రద్దు చేసి అశుతోష్‌ మిశ్రా 11వ పిఆర్‌సి నివేదికను బహిర్గత పరచాలని డిమాండ్‌ చేశారు. పాత హెచ్‌ఆర్‌ ఏ శ్లాబ్‌లను కొనసాగించాలని, సిసిఎ అలవెన్స్‌ను కొనసాగించాలని, విరమణ వయస్సు 62 ఏళ్లుగా పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేయడాన్ని తప్ప ఎలాంటి ప్రకటనలూ అంగీకరించమని చెప్పారు. సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేసి 2021 అక్టోబర్‌ నుంచి వేతన స్కేలు అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ వేతన సవరణ కమిటీని అమలు చేయకూడదని డిమాండ్‌ చేశారు. రామాంజనేయులు, తిమ్మన్న, వెంకటరాముడు, సాయిబాబా, సురేష్‌ పాల్గొన్నారు.