Oct 03,2022 23:29

అరకులో మాట్లాడుతున్న పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రమాప్రభ

ప్రజాశక్తి - పాడేరు : ప్రజల కోసం.. ప్రజల తరుపున నిరంతరం పోరాడే అల్లూరి జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాల నేతలందరూ ఐక్యమై ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్‌ విజయానికి కృషి చేయాలని అభ్యర్థిగా నిలిచిన సామాజిక కార్యకర్త డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ కోరారు. అల్లూరి జిల్లా కేంద్రమైన పాడేరులో సోమవారం ఆమె పలు ప్రజా సంఘాల నేతలు, పట్టభద్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటర్ల నమోదు అత్యంత కీలకమన్నారు. పట్టభద్రులను చైతన్యపరిచి ప్రజా విజయం సాధించేందుకు ఓటర్ల నమోదుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. విశాఖపట్నానికి చెందిన ఓ హవాలా వ్యాపారికి వైసిపి మద్దతునిచ్చి అభ్యర్థిగా నిలబెట్టిందన్నారు. అతనికి ప్రజా పోరాటాలతో ఎటువంటి సంబంధమూ లేదన్నారు. విభజన హామీలను నెర వేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. విభజన హామీల్లో ఒకటైన గిరిజన వర్సిటీకి అవసరమైన స్థలాన్ని నేటికీ కేటాయించలేదన్నారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే ప్రభుత్వాలకు నచ్చడం లేదని, సిపిఎస్‌ రద్దు కోసం ఉద్యమించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ నిర్బంధాన్ని చవిచూడాల్సి వచ్చిందని అన్నారు. ప్రజలకు డబ్బు ఇస్తే చాలు అనే ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. మున్ముందు ప్రజా పోరాటాలు ఎన్నో నిర్వహించాల్సి ఉందని, ఈ ఎన్నికల్లో తాను ప్రజా విజయం సాధించి ఉద్యమాలకు ఊతంగా నిలుస్తానని రమాప్రభ స్పష్టం చేశారు.
ఎపి గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అప్పలనర్స మాట్లాడుతూ, 300 ప్రజా సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా కోరెడ్ల రమాప్రభ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఆమె గెలుపు గొప్ప ప్రజా విజయం అవుతుందని, అందుకు అన్ని సంఘాల వారు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. వైసిపి, బిజెపి ఒక తానులో ముక్కలేనని, ఆ రెండు పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్‌ మాట్లాడుతూ సమాజంలో అవినీతి, అక్రమాలు పెచ్చుమీరుతున్నాయని, ఈ తరుణంలో పట్టభద్రుల ఓటర్లలో చైతన్యం తేవాలని, వారు ఎన్నికల్లో ప్రలోభాలకు గురి కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పి.మహేష్‌ మాట్లాడుతూ అందరి సమిష్టి కృషితో రమాప్రభ విజయం ఖాయమని అన్నారు రాజకీయాలకు అతీతంగా చట్టసభల్లో ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎన్నుకోవడం విద్యావంతుల లక్షణమని గుర్తు చేశారు. సమావేశంలో యుటిఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, సిఐటియు తదితర ప్రజా సంఘాల నాయకులు హైమావతి, వై.మంగమ్మ చీకటి నాగేశ్వరరావు, ప్రభుదాస్‌, ఎల్‌.సుందరరావు తదితరులు పాల్గొన్నారు.
అరకులోయ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సమస్యలపై పెద్దల సభలో ప్రశ్నించే గొంతునౌతానని ఉత్తరాంధ్ర పట్టభద్రుల పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి, సామాజిక కార్యకర్త డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ స్పష్టం చేశారు. అరకులోయలోని గిరిజన భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన పరిచయ వేదికలో ఆమె మాట్లాడారు. జగన్‌ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎపి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ సమస్యలపై అవగాహన ఉన్న వారే చట్ట సభల్లో ఉండాలని, రమాప్రభ గెలుపునకు అందరూ కృషి చేయాలని కోరారు. చట్టసభల్లో ప్రశ్నించేవారు లేకపోవడంతోనే ఏజెన్సీ ప్రాంతంలో డోలీ మోతలు తప్పడం లేదన్నారు. గిరిజనుల అభివృద్ధికి విద్య, వైద్యం, ఉపాధితో పాటు మెడికల్‌ కళాశాలలు వంటివి రావాలని, గిరిజన చట్టాలు, హక్కులు రక్షించబడాలంటే పిడిఎఫ్‌ అభ్యర్థులు గెలుపు అవసరమని అన్నారు. అనంతగిరి జెడ్‌పిటిసి సభ్యులు దీసరి గంగరాజు మాట్లాడుతూ, నేటి తరుణంలో పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరముందన్నారు. జీవో నెంబర్‌ 3, 1/70 చట్టం, పీసా చట్టం రక్షణకు, పిఆర్‌సి సాధనకు పిడిఎఫ్‌ అభ్యర్థుల విజయం దోహదపడుతుందన్నారు. యుటిఎప్‌ ప్రతినిధి రఘునాథ్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌, సిఐటియు, గిరిజన సంఘం, పాస్టర్స్‌ యూనియన్‌, ఎపి టూరిజం, విద్యార్థి సంఘాలు, ఎపిఎండిసి, అంగన్‌వాడీ, పలు ప్రజా సంఘాల నాయకులు చిట్టిబాబు, ఉమామహేశ్వరరావు, మహేష్‌, నాగమ్మ, బాలదేవ్‌, వివి.జయ, డేవిడ్‌, సర్పంచ్‌ చిన్నబాబు పాల్గొన్నారు.