Oct 03,2022 01:24

మీగడ వెంకటేశ్వరెడ్డి,పి.బాబు రెడ్డి

ప్రజాశక్తి-ఒంగోలుబ్యూరో : తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలకు పోటీచేసే అభ్యర్థులను పిడిఎఫ్‌ ఆదివారం ఖరారు చేసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లూరు జిల్లాకు చెందిన యూటిఎఫ్‌ రాష్ట్ర నేత పి.బాబురెడ్డి, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జిల్లాకు చెందిన ఉపాధ్యాయ ఉద్యమ సీనియర్‌ నేత మీగడ వెంకటేశ్వరెడ్డిని ఎంపిక చేశారు. యుటిఎఫ్‌, ఎస్‌టియు తదితర ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో ఈ ఎంపిక జరిగింది. గతంలో మాదిరిగానే ఇపుడూ వీరికి అన్ని ప్రజాసంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ప్రస్తుతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న విఠపు బాలసుబ్రమణ్యం మూడు సార్లు వరుసగా గెలిచారు. వయోభారం, ఆరోగ్యకారణాల రీత్యా ఆయన ఈసారి పోటీలో లేరు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ యండపల్లిశ్రీనివాసులరెడ్డి రెండు పర్యాయాలు గెలిచారు. కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో జిల్లాకు చెందిన మీగడ వెంకటేశ్వరెడ్డిని గ్రాడ్యుయేట్‌ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో ఉండే ఈ ఎమ్మెల్సీలు నియోజకవర్గంలో మండలి పునరుద్ధరణ నుంచి పిడిఎఫ్‌ కూటమి తరపున గెలుస్తున్నారు.మేధావులు,విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ప్రవేటు ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ పిడిఎఫ్‌ కూటమికే మద్దతుగా నిలిచారు.ప్రజల గొంతక మండలిలో అవసరమని భావించి పిడిఎఫ్‌కు పట్టం కడుతున్నారు. ఎవరు అధికారంలో ఉంటే ఆపార్టీ ఈ ఎమ్మెల్సీలను కూడా రాజకీయం చేసేందుకు చేసిన యత్నాలు ఇప్పటి వరకూ ఫలించలేదు. రాజకీయాలకు అతీతంగా ఉన్న పిడిఎఫ్‌ కూటమికే ఓటర్లు ఆదరణ చూపారు. ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగకార్మికసంఘాలు వీరికి మద్దతుగా ఉన్నాయి. వామపక్షాలు కూడా వీరికి మద్దతు ప్రకటించాయి. అయితే నేరుగా పార్టీల నుంచి గతంలో కాంగ్రెస్‌, టిడిపి నుంచి రంగంలోకి దింపినా ఫలితం లేదు. వైఎస్‌ సిఎంగా ఉన్నపుడు ఆ పార్టీ అభర్థి పోటీచేసి ఓటమిపాలయ్యారు. అప్పడూ పిడిఎఫ్‌ అభ్యర్థులే గెలిచారు. టిడిపి ప్రభుత్వ హయాంలోనూ బలమైన అభ్యర్థులను నారాయణ కాలేజీల నుంచి పోటీలో పెట్టారు. అధికారంలో ఉన్నా కూడా టిడిపి అభ్యర్థులు గెలవలేకపోయారు.పిడిఎఫ్‌ అభ్యర్థులే గెలిచారు. ఇపుడూ మళ్లీ టిడిపి నుంచి అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వైసిపి కూడా గ్రాడ్యుయేట్‌ అభ్యర్థిని రంగంలోకి దించింది. పార్టీల పరంగా రంగంలో ఉన్న అభ్యర్థులకు గతంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో చూశాం. ఇపుడూ ఇదే జరగనుందనే చర్చ వినిపిస్తోంది. ఈసారి పిఆర్‌సి,సిపిఎస్‌ రద్దు నిర్ణయాలపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. ఇపుడు వైసిపి నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో మాదిరిగా ఏదో రకంగా ప్రలోభాలకు గురిచేసి ఓట్లు వేయించుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ జగరవని తెలిసే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏదేమైనా పిడిఎఫ్‌ బలమైన ఉద్యమ అభ్యర్థులను రంగంలోకి దించింది. ఇద్దరూ సుదీర్గకాలంపాటు ఉపాధ్యాయ రంగంలో పనిచేస్తూ యుటిఎఫ్‌లో జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకూ వివిధ బాధ్యతలు నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారంలో ప్రధాన భూమిక పోషించారు. వైసిపి, తెలుగుదేశం అభ్యర్థులకు ఆస్తులు తప్ప స్పూర్తిదాయకమైన చరిత్ర అంటూ ఏదీ కనిపించడం లేదు.
మీగడ ఉద్యోగ...ఉద్యమ ప్రస్థానం...
గ్రాడ్యుయేట్‌ అభ్యర్థిగా ఎంపికైన మీగడ వెంకటేశ్వరెడ్డి1958లో ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గుండ్లపాలెంలో జన్మించారు. ప్రస్తుతం ఆయన కనిగిరిలో నివాసం ఉంటున్నారు.1 నుంచి 3వ తరగతివరకూ తాళ్లూరు ప్రాథమిక పాఠశాలలో చదివారు. 4 నుంచి ఇంటర్‌ వరకూ కనిగిరిలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో చదివారు. డిగ్రీ చీరాలలో పూర్తిచేశారు. బిఇడి ఆంధ్రాయూనివర్సిటీలో చేశారు.1984లో లింగసముద్రం మండలం యర్రారెడ్డి పాలెంలో సెకండ్‌గ్రేడ్‌ టీచరుగా ఉద్యోగంలో చేరారు. తర్వాత తాళ్ళూరు, పామూరు, మార్కాపురం, సంతనూతలపాడు, కంచెర్లవారిపల్లె, చింతలపాలెం హైస్కూళ్లలోనూ ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు.1984లో ఉపాధ్యాయ వృత్తిలో చేరినప్పటి నుంచి యుటిఎఫ్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. 1986లో లింగసముద్రం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.1992లో జిల్లా కార్యదర్శిగా పనిచేశారు.2000లో జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ వచ్చారు. ఆయన మంచి క్రీడాకారుడు కూడా కాలేజీలో చదివే రోజుల్లో .లాంగ్‌జంపు,హైజంపులో పాల్గొనేవారు. ఇక ఆయన ఎక్కడ పనిచేసినా గ్రామస్తులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు.వారి మధ్య ఏమైనా చిన్నచిన్న సమస్యలు వచ్చినా ఆయన జోక్యం చేసుకుని పరిష్కారం చేసేవాళ్లు. పనిచేసిన అన్నిచోట్లా గ్రామస్తులతో కలిసిపోయి వారిలో ఒకరుగా ఉంటారు. అందరి మన్ననలు పొందారు. ఉపాధ్యాయ సంఘ నేతగా మీగడ వెంకటేశ్వరెడ్డి అంటే తెలియని వాళ్లుండరు. ప్రజాప్రతినిధులకూ మంచి ఆత్మీయుడుగానే ఉంటారు. పశ్చిమాన ఆయనక మంచి సంబంధాలున్నాయి.ఇదే ఆయన గెలుపునకు దోహదపడుతుందనే ఆశాభావం అందరిలోనూ వ్యక్తమవుతోంది.