Oct 28,2021 09:02

ఇస్లామాబాద్‌ : భారత్‌ దాయాదీ దేశం పాకిస్తాన్‌ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీనికి ఆర్థిక సాయం అందించేందుకు సౌదీ అరేబియా ముందుకు వచ్చింది. 4.2 బిలియన్‌ డాలర్లు సమకూర్చేందుకు అంగీకారం తెలిపింది. ముందుగా పాకిస్తాన్‌ కేంద్ర బ్యాంకులోకి 3 బిలియన్‌ డాలర్లను సౌదీ డిపాజిట్‌ చేయనుంది. మరో 1.2 బిలియన్‌ డాలర్లను రిఫైన్డ్‌ పెట్రోలియం ఉత్పత్తులకు ఆర్థిక సహకారం అందించనుంది. అయితే పాక్‌కు సౌదీ అరేబియా ఆర్థిక సాయం అందించడం ఇదేమీ తొలిసారి కాదు. 2018లో 3 బిలియన్‌ డాలర్లను సాయం చేసి పాక్‌ను ఆదుకుంది. అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో 3 బిలియన్‌ డాలర్లలో 2 బిలియన్‌ డాలర్లను పాక్‌ తిరిగి వెనక్కి ఇచ్చేసింది. సౌదీలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పర్యటించడం మళ్లీ సంబంధాలు చిగురించాయి. యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో చర్చలు జరిపిన కొన్ని రోజుల తర్వాత పాకిస్తాన్‌కు సాయమందిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ సాయానికి సౌదీ యువరాజుకు పాక్‌ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తమ దేశాన్ని ఆదుకున్నందుకు ట్విట్టర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ సాయంతో భారీగా అప్పుల్లో కూరుకుపోయిన పాక్‌ కాస్త ఉపశమనం కల్గినట్లయింది. కాగా, ఈ సాయంపై ఇమ్రాన్‌ ఆర్థిక సలహాదారు శౌకత్‌ తరిణ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. సౌదీ ఆర్థిక ప్యాకేజీతో అంతర్జాతీయ ద్రవ్యనిధి కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు.