
నగర కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన డివైఎఫ్ఐ నేతలు
ప్రజాశక్త-విజయవాడ
స్థానిక గాంధీనగర్‌లోని సర్ విజ్జి నగరపాలక సంస్థ ఈత కొలనులో బుధవారం రాత్రి క్లోరిన్ మోతాదు ఎక్కువై పది మంది చిన్నారులు, అక్కడే పని చేస్తున్న మరో యువకుడు అస్వస్థతకు గురైన ఘటన పట్ల విచారణ జరిపించి, తగిన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) నాయకులు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి కృష్ణ, ఎన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ గాంధీనగర్‌లోని మునిసిపల్ స్విమ్మింగ్ పూల్‌లో వస్తున్న స్విమ్మర్స్కు సరైన సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమయిందని అన్నారు. ఫీజులు వసూలు చేసే విషయంలో చూపిస్తున్న శ్రద్ద , సదుపాయాల కల్పనలో ఎందుకు శ్రద్ద పెట్టడం లేదని వారు ప్రశ్నించారు. స్మిమ్మింగ్ పూల్‌లో క్లోరిన్ గ్యాస్ ట్యాంక్ లీకేజి కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలుపుతున్నారని, అయితే 20 సంవత్సరాలుగా అదే క్లోరిన్ గ్యాస్ ట్యాంక్‌లను వాడుతుండటం సోచనీయమన్నారు. తుప్పు పట్టి, శిధిలావస్థకు చేరిన, పాతపడిన గ్యాస్ ట్యాంక్‌లు వాడటం వలన ఇప్పటికే పలు సార్లు ఈ గ్యాస్ లీక్ అవుతూ ప్రమాదాలు జరుగుతున్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. స్విమ్మింగ్ పూల్‌కు వస్తున్న స్విమ్మర్స్ నుంచి డిపాజిట్ రూపంలో రూ.1500, నెల వారీ ఫీజు రూపంలో మరో రూ. వెయ్యి నిర్వహకులు వసూలు చేస్తున్నారన్నారు. ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ...తప్పని సరిగా ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీనిచ్చారు. స్మిమ్మింగ్ పూల్‌లో సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీనిచ్చినట్లు డివైఎఫ్ఐ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సిటీ కార్యదర్శి షక్ నిజాముద్దీన్, తదితరులు పాల్గొన్నారు.