
న్యూఢిల్లీ : పార్టీ పనుల్లో ఎంత బిజీగా ఉన్న పిల్లల హోం వర్క్ విషయంలో సహాయం చేస్తాను అంటున్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. మంగళవారం ఫేస్బుక్లో లైవ్ చాట్ సెషన్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. తాను తన పిల్లల విషయంలోనే కాకుండా.. స్నేహితుల పిల్లల విషయంలోనూ సాయపడతానని తెలిపారు. వారి పిల్లలు సైతం ఆంటీ అంటూ తన వద్దకు వస్తారని, వారి హోం వర్క్‌లో కూడా సాయం చేస్తానని తెలిపారు. మీ పిల్లలు హోం వర్క్‌లో మీరు సాయపడతారా అన్న నెటిజన్ ప్రశ్నకు ఆమె ఈవిధంగా సమాధానం చెప్పారు. ' ఈ రోజు కూడా అసైన్మెంట్తో తన కుమార్తెకు సహాయం చేశాను' అని తెలిపారు. ప్రియాంక గాంధీకి ఇద్దరు పిల్లలు... మిరయా వాద్రా, రిహాన్ వాద్రా. కొన్నిసార్లు తాను ఎన్నికల ప్రచారం నుండి ఇంటికి వచ్చినప్పుడు, తన పిల్లల హోం వర్క్ పూర్తి కావడం కోసం ఉదయం 3-4 గంటల వరకు వారితో కూర్చుండిపోతానని అన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తి కర విషయాన్ని పంచుకున్నారు. చిన్నతనంలో తాను..తన సోదరుడు రాహుల్ గాంధీతో గొడవ పడేదాన్ని అని తెలిపారు. అదే బయటి వ్యక్తులు తమ విషయంలో కలుగ జేసుకుంటే.. ఇద్దరం ఒక టీమ్ అయ్యిపోయేవాళ్లమని అన్నారు.