Aug 19,2022 00:37

సదస్సులో పాల్గొన్న రామ్మోహన్‌రావు తదితరులు

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో
దేశంలో పోర్టుల ద్వారా జరిగే సరకు రవాణా వ్యాపారంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థల భాగస్వామ్యం కీలకమైందని రెండు రోజుల పాటు నగరంలో జరిగిన మారిటైం - 2022 కాన్‌క్లేవ్‌ వెల్లడించింది. తలో చేయి వేస్తే తప్ప అభివృద్ధి రథం ముందుకు సాగదని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. పిపిపి విధానంలో అనేక సమస్యలున్నాయంటూ పోర్టు అథారిటీ ఛైర్మన్‌ కె.రామ్మోహనరావు తొలిరోజు చెప్పారు. అయినా దీన్ని కొనసాగించడం తప్ప వేరే మార్గం లేదని ఆయన సహా, పలువురు ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. గురువారం ఉదయం నోవాటల్‌లో జరిగిన రెండో రోజు ప్రారంభ సదస్సులో రైల్వే డిఆర్‌ఎం అనూప్‌ కుమార్‌ సత్‌పతి మాట్లాడుతూ కస్టమర్లను ఆకట్టుకునే భవిష్యత్‌ ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. గతి శక్తి ప్రాజెక్టుల వల్ల రైల్వేల్లో మెయింటెనెన్స్‌, కనెక్టివిటీ పరంగా ఖర్చు గణనీయంగా తగ్గిందన్నారు. వాల్తేరు రైల్వేలో సరకు రవాణాకు ర్యాకుల కొరత ఉందన్నారు. ఆ సమయంలో పిపిపి ఆపరేటర్‌ ఒకరు లేచి సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో ఈ రోజు ర్యాకు అడిగితే రేపటికి వస్తుందని, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలో అలా లేదని ప్రశ్నించగా.. 'అక్కడ ట్రాఫిక్‌ తక్కువ... వాల్తేరులో ఎక్కువ.. లోడింగ్‌ స్టేషన్‌గా వాల్తేరుపై భారం ఉంది' అని డిఆర్‌ఎం బదులిచ్చారు. వాల్తేరు రైల్వే 22.19 మిలియన్‌ టన్నుల ఐరన్‌ ఒక రోజుకు లోడింగ్‌ చేస్తోందని, 2021-2022లో ఒక రోజుకు 13.7 ర్యాకులను కిరండోల్‌, బచేలీ నుంచి లోడింగ్‌ చేపట్టిందని అన్నారు. 2024 - 2025 నాటికి ఐరన్‌ ఓర్‌ లోడింగ్‌ 45 మిలియన్‌ టన్నులు పెరగనుందని అంచనా వేస్తున్నామని, రోజుకు 27 ర్యాకులు ఏర్పాటు చేసే సత్తా వాల్తేరుకు వస్తుందని అన్నారు. వైజాగ్‌ పోర్టు నుంచి 2024-25 నాటికి కిరండోల్‌, బచేలీకి 11.70 మిలియన్‌ టన్నులు అంటే మొత్తం ఐరన్‌ ఓర్‌లో 26 శాతం పోర్టు నుంచి ఆ ప్రాంతాలకు రైల్వే రేకుల్లో వెళ్లనుందని అన్నారు. 50 శాతం కెకె లైన్‌ టు కొత్తవలసను డబుల్‌ లైన్‌గా మార్చామని వెల్లడించారు. హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ సిఎమ్‌డి హేమంత్‌ ఖత్రీ మాట్లాడుతూ షిప్‌ బిల్డింగ్‌, షిప్‌ రేపేర్లు షిప్‌యార్డులో చేపట్టేందుకు అనేక అవకాశాలున్నాయన్నారు. తూర్పు నౌకాదళ కేంద్రానికి అవసరమైన షిప్‌ రిపేర్లు గతంలో ఇతర చోట్లకి వెళ్లేవని, ప్రస్తుతం హెచ్‌ఎస్‌ఎల్‌లో నిర్వహిస్తున్నామని అన్నారు. క్రూయిజ్‌ టూరిజంకు విశాఖ కేంద్రంగా అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాంకర్‌) చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అనిల్‌ నారాయణ మాట్లాడుతూ 2003లో పిపిపి ఆపరేటర్‌గా పోర్టు ఏరియాలో పని ప్రారంభి ంచామని, ఈ 19 ఏళ్లలో హింటర్‌ ల్యాండ్‌ కార్గోను అభివృద్ధి చేశామని అన్నారు. దేశంలోని ఒడిసా, ఛత్తీష్‌ఘడ్‌, రాయపూర్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లలో కాంకర్‌ కార్గో చేస్తోందని, గత ఏడాది ఐదు లక్షల టన్నుల కంటైనర్‌ను చేపట్టామని తెలిపారు.