Mar 18,2023 21:00

ఇస్లామాబాద్‌ : అవినీతి కేసులో నేరారోపణ లేకుండానే వెనక్కి వెళ్ళేందుకు పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను స్థానిక కోర్టు శనివారం అనుమతించింది. పలుసార్లు కోర్టు విచారణలకు హాజరవనందుకు గానూ ఖాన్‌ను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్న భద్రతా బలగాలకు, ఆయన మద్దతుదారులకు మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో కోర్టు కాంప్లెక్స్‌ వెలుపలకు ఖాన్‌ హాజరు కావడంతో ఈ పరిస్థితి ఎదురైంది. తన ఆస్తులను ప్రకటించే సమయంలో తనకు వచ్చిన బహుమతుల వివరాలను దాచి వుంచినందుకు గానూ పాకిస్తాన్‌ ఎన్నికల కమిషన్‌ చేసిన ఫిర్యాదుపై జరుగుతున్న విచారణ కోసం ఖాన్‌ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు ముందు హాజరు కావాల్సి వుంది. గంటల తరబడి ఖాన్‌ కోసం వేచి వున్న న్యాయమూర్తి, ఖాన్‌ తరపు న్యాయవాది చేసిన సూచనకు అంగీకరించి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా హాజరైనట్లు సంతకం తీసుకోవడానికి అంగీకరించారు. ఇస్లామాబాద్‌ జ్యుడీషియల్‌ సముదాయానికి తన వాహనంలో వచ్చిన ఖాన్‌ అక్కడ సంతకం పెట్టి వెనక్కి తిరిగి వెళ్లడానికి న్యాయమూర్తి అంగీకరించారు. తోషఖనా కేసులో విచారణ ఈనాడు నిర్వహించలేమని అందువల్ల ఇక్కడ గుమిగూడిన వారందరూ దయచేసి వెళ్ళిపోవాలని న్యాయమూర్తి పేర్కొన్నట్లు డాన్‌ పత్రిక తెలిపింది.