Jul 19,2021 07:27

పిల్లలూ, ఈ చేప అచ్చం పక్షిలాగా రెండు రెక్కలు ఉండి గాలిలో ఎగురుతుంది. మరి ఆ చేప విశేషాలు తెలుసుకుందామా ? చాపలా వెడల్పుగా పరుచుకున్న శరీరం, సన్నని తోకతో గాలిపటంలా కనిపిస్తోంది కదూ! అదే ఈ మొబులా రే చేప. ఈ మొబులా రేలు ఎక్కువగా మెక్సికో, కాలిఫోర్నియా తీరాల్లో కనిపిస్తాయి. వీటిని చూడటానికి చాలా మంది పర్యాటకులు ఈ తీరప్రాంతాల్లో గుమిగూడతారు.
    ఇది ఎగిరినప్పుడు కొంత దూరం నుంచి చూస్తే చిన్న విమానం దూసుకెళ్తున్నట్టు ఉంటుంది. ఇవి ఒక్కసారిగా పైకెగిరి సుమారు రెండు మీటర్ల ఎత్తుకు వెళ్లి తిరిగి సముద్రంలో దబ్బున పడతాయి. ఆ సమయంలో వాటి రెక్కల్లాంటి మొప్పల్ని దగ్గరగా తీసుకుని అచ్చు పక్షిలాగా కనిపిస్తాయి. కాస్త తీరిక దొరికితే చాలు ఇవి ఇలా ఎగురుతూనే ఉంటాయి. అసలు ఇవి ఎందుకు ఎగురుతున్నాయో మాత్రం ఇంత వరకు శాస్త్రవేత్తలకు తెలియలేదు. కొందరు శాస్త్రవేత్తలు అవి ఆనందం వేసినప్పుడు అలా ఆడుకుంటున్నాయని భావిస్తే, మరికొందరు ఆహారం పట్టుకోవడంలో అదో ప్రక్రియని చెపుతున్నారు. అలా ఎగిరినప్పుడు ఒంటిపై ఉన్న వివిధ పారాసైట్‌లు కిందికి రాలిపోతాయని, వాటిని తినడానికి వచ్చిన చిన్న చేపల్ని ఇవి పట్టి తింటాయని భావిస్తున్నారు. తీర ప్రాంతాల్లోని నీటిలో ఒకే దగ్గర గుంపులు గుంపులుగా ఉంటాయి. అప్పుడు చూస్తే ఆ ప్రదేశమంతా నీలం దుప్పటి కప్పినట్టుగా కనిపిస్తుంది.
ఈ మొబులా రేలు పదడుగుల పొడవు, 17 అడుగుల వెడల్పున ఉంటాయి. బరువు ఒక టన్ను వరకు పెరుగుతాయి. రేల కుటుంబంలో మాంటారేల తరువాత ఇవే అతి పెద్ద రే జాతి. రొయ్యల్లా కనిపించే క్రస్టసీన్స్‌, క్రిల్స్‌ చేపల్ని తింటాయి. వీటి సంఖ్య ఇప్పుడు ప్రమాదంలో పడింది. అందుకే మెక్సికన్‌ ప్రభుత్వం వీటిని చంపితే పది వేల డాలర్ల జరిమానా విధిస్తోంది.