Sep 23,2022 17:31

వాషింగ్టన్  : పాకిస్థాన్‌ ఎఫ్‌ -16 యుద్ధ విమానాలకు అవసరమైన కీలక విడి భాగాలను అందించేందుకు అమెరికా గ్రీన్‌సిగ్నల్  ఇచ్చింది.  అయితే  బైడెన్‌ చర్య భారత్‌కు హెచ్చరికలు పంపేందుకు రూపొందించినది కాదని అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. 450 మిలియన్‌ డాలర్ల విలువైన ఈ పథకాన్ని ట్రంప్‌ ప్రభుత్వం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. అమెరికా -పాకిస్థాన్‌ రక్షణ సహకారం, ఎఫ్‌ -16 జెట్‌ విమానాల అభివృద్ధి చర్యలు రష్యా విషయంలో భారత్‌ తటస్థంగా ఉండటంపై ఆగ్రహించి తీసుకున్న చర్య కాదుకదా అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీనిపై రక్షణ శాఖ అసిస్టెంట్‌ సెక్రటరీ ఎలై రాట్నర్‌ మాట్లాడుతూ.. కానే కాదని అన్నారు. పాకిస్థాన్‌తో ముడిపడి ఉన్న తమ రక్షణ భాగస్వామ్యం దృష్ట్యా అమెరికా ప్రయోజనాలను అంచనా వేయబడిందని అన్నారు. ఇది ప్రధానంగా ఉగ్రవాద నిరోధకం, అణు భద్రతపై దృష్టి సారించిందని చెప్పారు. అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్‌ ఆస్టిన్‌తో గతవారం భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ మాట్లాడారు. ఆ సమయంలో పాకిస్థాన్‌ ఎప్‌ -16 పథకంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. రష్యాతో భారత్‌ రక్షణ సంబంధాలు కొన్ని దశాబ్దాల కిందటే ముగిసింది. భారత్‌కి చెందిన అతిపెద్ద యుద్ధ పరికరాలన్నీ రష్యా నుండి వచ్చినవే. అయితే ఇటీవల సంవత్సరాల్లో భారత్‌ యుద్ధవిమానాలను, పరికరాలను అమెరికా నుండి దిగుమతి చేసుకుంటోంది.