Jul 27,2021 19:09

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ ప్లాస్టిక్‌ వాడకం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ప్రత్యేకించి ఇంట్లో వాడుతున్న ప్లాస్టిక్‌ చెత్తను ఖాళీ ప్రదేశాల్లో పడేయడం వల్ల నేల కలుషితమై వర్షపు నీరు భూమిలోకి ఇంకడం లేదు. దీంతో నేలలో నీరు శాతం తగ్గిపోతుంది. బోర్లు వేసినప్పుడు రైతుల పంటలకు, తాగేందుకు నీరు త్వరగా రావడం లేదు. ఈ వాస్తవాన్ని మాన్‌వీర్‌ సింగ్‌ ప్రజలకు తెలియజేయాలనుకున్నాడు. తనకు తెలిసిన ఆర్ట్‌ ద్వారా అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు.

ఢిల్లీలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఓ పర్వతంలా ఎక్కడబడితే అక్కడ పేరుకుపోతున్నాయి. దీనివల్ల వాతావరణంతో పాటు, భూమి కూడా ఎంత కాలుష్యమవుతుందో ఊహించుకుంటేనే భయమేస్తుందని ఆర్టిస్ట్‌ మాన్‌వీర్‌ సింగ్‌ ఆందోళన చెందాడు. ప్రజల్లో ఎలాగైనా అవగాహన కల్పించాలనుకున్నాడు. తనకు వచ్చిన ఆర్ట్‌ స్టైల్‌లోనే వాటిని చూపించే ప్రయత్నం చేశాడు. తన స్నేహితులు, చుట్టుపక్కల వారి ఇళ్లలోని చెత్తను తనకు ఇమ్మని అడిగేందుకు మొదట ఇబ్బంది పడ్డాడు. ఆ ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి అందమైన ఆకృతులను తయారు చేస్తానని చెబితే వారికి అర్థం కాలేదు. కానీ ఎలాగోలా వారిని ఒప్పించి... కొన్ని రోజుల తర్వాత ప్లాస్టిక్‌ చెత్తను సేకరణకు అట్టపెట్టెలు ఇచ్చాడు. క్రమంగా 15 రోజులకోసారి 25 కుటుంబాల నుంచి ప్లాస్టిక్‌ను సేకరించాడు. వచ్చిన 250 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలతో జనాల్లో ఆలోచన రేకెత్తించే ఆర్ట్‌ వర్క్‌ రూపొందిస్తున్నాడు.

తన ఆర్ట్‌తో ఆర్థిక సంపాదన కన్నా ... నేలతల్లికి, పర్యావరణానికి మేలు చేకూరాలని మాన్‌వీర్‌ పనిలో మార్పులు చేసుకున్నాడు. రంగులకు బదులు ప్లాస్టిక్‌ని వాడటం మొదలు పెట్టాడు. రాపర్స్‌, బ్యాగ్స్‌, కవర్స్‌ వంటి వాటిని కరిగించి అందమైన చిత్రాలను గీస్తున్నాడు. బోర్డ్‌, మెటల్‌, మిర్రర్‌తో ఆధారంగా చేసుకొని 11 రకాల ఆర్ట్‌ వర్క్స్‌ తయారుచేశాడు. ఇవి తయారుచేయడానికి రెండు, మూడు నెలలు సమయం పట్టింది. అతను తయారుచేసిన కళాకృతులు, చిత్రాలను మ్యూజియమ్స్‌, ఆర్ట్‌ గ్యాలరీస్‌, ఆర్ట్‌ పెంట్స్‌ ఇలా కొన్ని ప్రదేశాల్లో ప్రదర్శిస్తున్నాడు.

ల్యాండ్‌స్కేప్‌ ఆర్ట్‌తో గుర్తింపు
మట్టి, ఖనిజాలతో ఉండాల్సిన భూమి భవిష్యత్తులో ఏ విధంగా మారుతుందో తెలియజేస్తూ ప్లాస్టిక్‌ వ్యర్థాలతో మాన్‌వీర్‌ ల్యాండ్‌ స్కేప్‌ ఆర్ట్‌ని తయారు చేశాడు. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసేలా ఉంది. 'అందరూ ప్లాస్టిక్‌ వాడి పడేయడం వల్ల భవిష్యత్తులో భూమి కింద పొరలు ప్లాస్టిక్‌తో నిండిపోతుంది' అనే అర్థం వచ్చేలా ఈ ఆర్ట్‌ ఉంది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ మాన్‌వీర్‌ సింగ్‌ సందేశాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.