Oct 03,2020 20:24

నా స్వస్థలం మంగళగిరి. ఏడేళ్లప్పుడే నాన్న చనిపోయారు. మేం ఆరుగురు సంతానం. మగ్గం నేసే కుటుంబం మాది. అమ్మ రెక్కల కష్టం మీద మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. పదో తరగతి చదివేట ప్పుడు నాకు ఇంగ్లీషు అంటే చాలా భయం. దీంతో ఆ సబ్జెక్టులో పబ్లిక్‌ పరీక్ష తప్పాను. బోధన సరిగ్గా లేకపోవడం వల్లే నేను వెనకపడ్డానని గ్రహించాను. ఎలాగోలా టెన్త్‌ పూర్తి చేసి ఇంటర్లో చేరాను. అక్కడ ఇంగ్లీషు మాస్టారి బోధనా పద్ధతి నన్ను బాగా ఆకర్షించింది. ఇంగ్లీషంటే మక్కువ ఏర్పడింది. భాషపై పట్టుకు ఆయన నేర్పిన మెళకువలు చాలా ఉపయోగ పడ్డాయి. డిఎస్సీలో ఉత్తీర్ణత సాధించి 2005లో దోనేపూడిలో ఇంగ్లీషు టీచరుగా చేరారు. భాష నేర్చుకోవడంలో నేను పడ్డ ఇబ్బంది నా విద్యార్థులు పడకూడదని, వారికి కొత్త పద్ధతుల్లో బోధించాలని నిర్ణయించుకున్నాను. ప్రపంచ ఉపాధ్యాయులతో మమేకం 2017లో బదిలీ మీద ఐలవరం జెడ్పీ హైస్కూలుకు వచ్చాను. అప్పుడే సోషల్‌ మీడియాలో వచ్చిన ఒక వార్త నన్ను ఆలోచింపచేసింది. అమెరికాలోని పట్టణ విద్యార్థులు 'స్క్వైప్‌' ద్వారా ఓ గ్రామంలోని విద్యార్థులతో ముఖాముఖి చర్చించడం చూశాను. ఆ పద్ధతిని మా విద్యార్థులకు చేరువ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను మా ప్రధానోపాధ్యా యుడు కటూరి లక్ష్మీనారాయణ గారితో పంచుకున్నాను. ఆయన బాగా ప్రోత్సహించారు. అప్పటివరకూ మా స్కూల్లో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు ఉన్నా... ఉపయోగించేవారు కాదు. కొత్త ఒరవడికి నాంది సోషల్‌ మీడియాలో నాకు పరిచయమైన ప్రపంచవ్యాప్త టీచర్లతో మా పిల్లలకు పాఠాలు చెప్పించేవాడిని. అక్కడి విద్యార్థులతో మాట్లాడించేవాడిని. ఆరేడు నెలల వరకు వారి భాష, యాస అర్థం కాక పిల్లలు ఇబ్బంది పడ్డారు. నేను వివరించి చెప్పేవాడిని. ఒక ఏడాదికి పరిస్థితి పూర్తిగా చక్కబడింది. తరువాత మా విద్యార్థులు నేరుగా వారితో సంభాషించటం మొదలెట్టారు. వారి ప్రశ్నలకు జవాబులు చెప్పడం, కొన్ని అంశాలపై ప్రశ్నించి తెలుసుకోవటం జరిగేది. విదేశీ విద్యార్థులతో మా పిల్లలు తమ స్నేహితులతో మాట్లాడినట్టే మాట్లాడుతుంటే చాలా సంతోషం కలిగేది. ఇతర దేశాల క్లాసురూమ్‌లు అత్యాధునిక హంగులతో ఉండేవి. మా తరగతి గది రంగు వెలసిపోయి, మరకలు పడి ఉండేది. దానివల్ల పిల్లలు చాలా సిగ్గు పడేవారు. ఆ ఇబ్బందిని పోగొట్టేందుకు, మా లక్ష్యం గురించి తెలిసి ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు రూ.లక్ష విరాళమిచ్చారు. గ్రామస్తులు కుర్చీలు ఏర్పాటు చేశారు. అలా మా తరగతి గదికి ఆధునిక హంగులు ఏర్పడ్డాయి. రోజూ సాయంత్రం విరామ సమయంలో 'స్క్వైప్‌' క్లాస్‌ ఏర్పాటు చేసేవారం. ఫ్రాన్స్‌, న్యూజిలాండ్‌, కెనడా, యూరప్‌, అమెరికా, ఇటలీ, జపాన్‌, ఆఫ్రికా వంటి అనేక దేశాల ఉపాధ్యాయులు మా పిల్లలతో మాట్లాడేవారు. వారి పద్ధతుల్లో పాఠాలు చెప్పేవారు. అక్కడి విద్యార్థులతో మా విద్యార్థులు మాట్లాడేవారు. అడ్మిషన్లు పెరిగాయి మా స్కూలు పిల్లల తల్లిదండ్రుల్లో ఎక్కువశాతం మంది నిరక్షరాస్యులు. కొంతమంది తల్లిదండ్రులకు మాత్రమే ఈ పద్ధతి వల్ల పిల్లలకు జరిగే ప్రయోజనాలు తెలుసు. 'స్క్వైప్‌' క్లాసులు ప్రారంభమయ్యాక ప్రైవేటు స్కూళ్ల నుంచి మా స్కూలుకు అడ్మిషన్లు పెరిగాయి. ఇతర దేశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో మా స్కూలు విద్యార్థులను అనుసంధానిస్తూ 'పెన్‌పాల్‌' (కలం స్నేహం) కార్యక్రమం కూడా చేపట్టాను. దీనివల్ల మా గ్రామ పోస్టు ఆఫీసుకు కట్టల కొద్దీ ఉత్తరాలు విదేశాల నుంచి వస్తున్నాయి. వాటికి సమాధానాలు రాసి పంపించేలోగా మరో దేశం నుంచి ఉత్తరాలు వస్తాయి. ఇప్పుడు కోవిడ్‌ కారణంగా విద్యార్థులకు 'జూమ్‌' ద్వారా తరగతులు నిర్వహిస్తున్నాను. 'ఈ విధమైన శిక్షణ వల్ల మా విద్యార్థులకు ఇంగ్లీషు భాషపై ఉండే భయాలు తొలగిపోతున్నాయి. వినడం, చదవడం, మాట్లాడడం వంటి అభ్యసనం వల్ల ఇది మరింత సులభమవుతుంది.'' అని వివరించారు హరికృష్ణ. స్క్వైప్‌, జూమ్‌ మాధ్యమాల ద్వారా 65 దేశాల్లోని 220 పాఠశాలల్లోని టీచర్లు, విద్యార్థులతో ఐలాపురం విద్యార్థులు మాట్లాడారు. వర్చువల్‌ ఫీల్డ్‌ ట్రిప్స్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చారిత్రక ప్రదేశాల గురించి తెలుసుకుంటున్నారు. అంతర్జాతీయ గుర్తింపు 'ఇంటర్నేషనల్‌ రీసెర్చ్‌ ఎక్స్చేంజ్‌ ప్రోగ్రాం'లో భాగంగా రెండు నెలల అమెరికా పర్యటనకు హరికృష్ణ ఎంపికయ్యారు. అమెరికాలోని 'డిపార్‌ ్టమెంట్‌ ఆఫ్‌ స్టేట్స్‌ బ్యూరో ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ కల్చరల్‌ అఫైర్స్‌' ఆధ్వర్యంలోని 'పుల్‌బ్రెట్జ్‌ ఫారిన్‌ స్కాలర్‌షిప్‌ బోర్డు' వంద దేశాల నుంచి ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. మనదేశం నుంచి ఎంపికైన ఆరుగురు ఉపాధ్యాయుల్లో హరికృష్ణ ఒకరు. కేరళ, మహారాష్ట్ర నుంచి ఇద్దరేసి, ఆంధ్ర, తెలంగాణ నుంచి ఒక్కొక్కరు ఈ పర్యటనకు ఎంపికయ్యారు. అమెరికాలోని పాఠశాలలు, యూనివర్శిటీల్లో నూతన విద్యావిధానాలు, బోధనా పద్ధతుల్లో మార్పులపై వీరు అధ్యయనం చేస్తారు. ఎంపికైన ఆరుగురిలో మొదటి బృందం 2021 జనవరిలో, రెండో బృందం సెప్టెంబరులో బయల్దేరతాయి. హరికృష్ణ మొదటి బృందంలో వెళ్లనున్నారు.