
ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : స్పందన కార్యక్రమాలనికి ప్రజల నుండి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్పందన హాలులో సోమవారం నిర్వహించిన 'స్పందన'లో ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వాటిని పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. అర్జీలను కలెక్టర్‌తోపాటు జెసి ఎ.శ్యాంన్రపసాద్, డిఆర్‌ఒ వినాయకం స్వీకరించగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 212 మంది అర్జీలను ఇచ్చారు. అర్జీదార్లకు పల్నాడు జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేశారు. ఇందుకు సహకరించిన వారిని అధికారులు సత్కరించారు.
చిరు వ్యాపారి ఆత్మహత్యాయత్నం
తనకు అన్యాయం జరిగిందని నరసరావుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల షేక్ అబ్దుల్ రహమాన్ అనే చిరు వ్యాపారి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన షాపును వైసిపి నాయకులు ఐటిసి సుభాని ఖాదర్‌బాషా, కోటిరెడ్డి అక్రమంగా తొలగించారని వాపోయారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద సుమారు 40 ఏళ్లగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మా కుటుంబానికి వైసిపి నాయకులు తీరని అన్యాయం చేశారని, దౌర్జన్యంగా ఖాళీ చేయించిన వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి కోరారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని అబ్దుల్ రహమాన్‌ను ఆసుపత్రికి తరలించారు.
ఎస్సీ ధ్రువపత్రం ఇవ్వాలి
బేడ, బుడగ జంగా సామాజిక తరగతికి చెందిన వారికి ఎస్సీలుగా పేర్కొంటూ ధ్రుపత్రాలు మంజూరు చేయాలని సంఘ రాష్ట్ర నాయకులు ఎల్లయ్య డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు బేడ బుడగ జంగాలకు ఎస్సీ ధ్రువపత్రం ఇచ్చారని, రాష్ట్ర విభజన తర్వాత తమ ఇవ్వడం లేదని చెప్పారు. దీనివల్ల అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని, పిల్లల చదువులు ఆటంకం కలుగుతోందని చెప్పారు. దీనిపై ఎన్నికలకు ముందు హామీనిచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు విస్మరించారని, దీంతో తమ పిల్లలు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.