
ప్రజాశక్తి - పెనుగొండ
పెనుగొండ గ్రామ పంచాయతీ పరిధిలో పని చేస్తున్న కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి ఎస్‌వి.నరసింహమూర్తికి మంగళ వారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల అధ్యక్షుడు నాగిశెట్టి గంగారావు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరారు. కార్మికులకు పది నెలలుగా ఇవ్వాల్సిన కొబ్బరి నూనె, సబ్బులు, మూడు సంవత్సరాలుగా యూనిఫారాలులు, పాదరక్షలు ఇవ్వడం లేదని విమర్శించారు. ఇవేమీ అమలు చేయకుండా కార్మికులకు పనులు పురమాయించడం అన్యాయం అన్నారు. కార్మికులపై వేధింపులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్.వెంకటేశ్వరరావు, మాదాసు నాగేశ్వరరావు, కార్మిక సంఘం నాయకురాలు బంగారు విజయ పాల్గొన్నారు.