Nov 30,2022 23:52

మాట్లాడుతున్న జెడ్‌పి చైర్‌పర్సన్‌ విజయ

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పంచాయతీల ప్రణాళికలు అత్యంత కీలకమని జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా విజయ అన్నారు. ఆ దిశగా సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో ఏడాది కాలం పాటు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. జిల్లా పంచాయతీరాజ్‌ రిసోర్స్‌ సెంటర్‌లో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2023-24 రూపొందించడానికి జెడ్‌పి సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి శిక్షణా తరగతులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల సమగ్రాభివృద్ధిపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రధానంగా తాగునీరు, సాగునీటి అవసరాలు, పారిశుధ్యం, విద్యుత్‌ సరఫరా, గ్రంథాలయాలు, గ్రామసభల నిర్వహణ, ఉపాధి హామీ నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. పంచాయతీలోని ఆదాయ వనరులు, ప్రభుత్వం నుంచి అందిస్తున్న నిధులు, ఇతర సౌకర్యాలకు తగ్గట్లుగా ప్రణాళిక ఉండాలన్నారు. ఆదాయానికి మించి ఖర్చులు చూపడం తగదన్నారు. అలాంటి సమయంలో ఆడిట్‌ పరంగా ఇబ్బందులు తలెత్తి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఓవర్‌ డ్రాప్టు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌, డ్వామా పీడీ జి.వి చిట్టిరాజు, నోడల్‌ అధికారులు, ఎంపిడిఒలు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.