Jan 15,2021 19:50

కళ్లంలో ఉన్న ధాన్యం బస్తాలు

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : ధాన్యపురాశులు ఓచోట.... వాటిని విక్రయించినా పైసా డబ్బులు రాక మరో చోట.. అసలు పంటలే పండక ఇంకోచోట... ఇది జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి. పండక్కి నాలుగు వేళ్లూ లోపలికి పంపే అన్నదాతలు అప్పులతో పండగచేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ధాన్యం కొనుగోలులో అధికార యంత్రాంగం చిత్తశుద్ధి కనబర్చకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల రైతులు అత్యంత వైభవంగా జరుపుకునే సంక్రాంతి వేల వడ్డీ వ్యాపారుల వేధింపులకు గురికావాల్సిన దుస్థితి దాపురించింది.
జిల్లా వ్యాప్తంగా వరి సాధారణ విస్తీర్ణం 2,97,500 ఎకరాలు కాగా, ఈ ఏడాది 2,70,000 ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. సుమారు 19మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఏర్పడినప్పటికీ నిబంధనల సాకుతో 11 మండలాలను మాత్రమే కరువు ప్రాంతంగా ప్రతిపాదించారు. అయినా రైతులు నాట్లు వేయడం మొదలుకుని పంట చేతికందే వరకు అష్టకష్టాలు పడ్డారు. ముఖ్యంగా చేనుదుబ్బు చేయాల్సిన స్థితిలో ఏర్పడిన వర్షాభావం వల్ల బతికించుకోవడానికి ఎంతో యాతన పడ్డారు. ఇక పెట్టుబడి గతంతో పోల్చితే ఎకరాకు రూ.5వేల పెరిగింది. ఈ ఏడాది ఎకరాకు రూ.30వేల వరకు మదుపు అయ్యిందని రైతులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి రైతులకు అండగా నిలబడాల్సిన అధికార యంత్రాంగం తనకు పట్టనట్టు వ్యవహరిస్తోంది. సాగు దిగుబడి, జిల్లా అవసరాలు ఆధారంగా ఈ ఏడాది 5లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయవచ్చని అధికారులు అంచనా వేశారు. ఇందుకనుగుణంగా జిల్లా వ్యాప్తంగా 255 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వీటిని ప్రారంభించిన అధికారులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు తమది రైతు పక్షపాతి ప్రభుత్వమంటూ ఊదరగొట్టిన ప్రసంగాలు ఇంకా రైతుల చెవుల్లో మారు మోగుతున్నాయి. కానీ, నేటికీ ఆయా కేంద్రాల్లో లక్ష్యానికి అనుగుణంగా కొనుగోలు చేయలేదు. గత నెలాఖరు వరకు సగానికి సగం కేంద్రాలు అసలు తెరుచుకోలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో, ఇప్పటి వరకు కేవలం 2.10మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. వీటికి సంబంధించి ఇప్పటి వరకు రూ.35కోట్లు మాత్రమే రైతులకు చెల్లించారు. ఇంకా రూ.80కోట్లకుపైగా రైతులకు చెల్లించాల్సివుందని సాక్షాత్తు అధికారులే సెలవిస్తున్నారు. దీన్నిబట్టి ఆయా కుటుంబాల్లో సంక్రాంతి వెలుగులు ఎంతమేరకు మెరుస్తాయో వేరేగా చెప్పనక్కర్లేదు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ఎప్పటి మాదిరిగానే దోపిడీ కొనసాగుతోంది. రైతులు పిపిసి కేంద్రాలకు వెళ్తే మిల్లర్లు అంగీకారం తెలిపితేనే తాము డాక్యుమెంటేషన్‌ చేస్తామని బాధ్యతా రాహిత్యంగా సెలవిస్తున్నారు. చేసేది లేక రైతులు మిల్లర్ల వద్దకు తీసుకెల్తే 8కేజీలు అధికంగా తూకం వేస్తున్నారని గంట్యాడ, సీతానగరం, బలిజిపేట మండలాల రైతులు గగ్గోలుపెడుతున్నారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు మాత్రం ధాన్యం కొనుగోలు ముమ్మరంగా సాగుతోందంటూ రోజూ ప్రకటనలు గుప్పిస్తున్నారు.