Jan 12,2021 20:11

చాలామంది రైతన్నల ఇళ్లల్లో పండగ కళ లేదు. అనేక రాష్ట్రాల రైతులు కుటుంబాలకు దూరంగా, ఇల్లు, పిల్లలను వదిలి కొందరు; వృద్ధులు, చంటిపిల్లలతో సహా వచ్చేసి మరికొందరు ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి పోరాటం చేస్తున్నారు. రోడ్డు మీదే జీవిస్తున్నారు. ట్రాలీలు, ట్రాక్టర్లు, టెంట్లే ఇప్పుడు వారి నివాసాలు. గడ్డకట్టే చలికి వణుకుతున్నా... వానకు తడుస్తున్నా... పోరాటాన్ని ఇసుమంత కూడా సడలనివ్వడం లేదు. పోరాట పథంలోనే కాదు; సేవాగుణంలో కూడా వారికి వారే సాటని నిరూపించుకుంటున్నారు. ఈ పండగ వేళ వారికి మద్దతుగా ఆలోచిద్దాం. రైతు వ్యతిరేక చట్టాలను భోగిమంటల్లోకి గిరాటు వేద్దాం.


సాధారణంగా నెలల తరబడి నిరసనలు సాగుతున్నప్పుడు, ఏదొక పేరు చెప్పి.. ఆందోళనలకు వ్యతిరేకంగా ఒక అభిప్రాయాన్ని రెచ్చగొట్టటానికి నానా ప్రయత్నాలూ చేస్తారు. రోడ్డుకు అడ్డం అనో, మరొకటనో కుట్రలకు తెగిస్తారు. చీలికలను ప్రోత్సహిస్తారు. ఈసారీ ప్రభుత్వం అలాంటి ఎత్తులు ఎన్నో వేసింది. కానీ, అవి పారలేదు. రైతులు నైతిక విజయం సాధించారు. ప్రజలందరి మనసులూ గెలుచుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఇంతమంది ఉంటే రాకపోకలకు అంతరాయం కదా.. అలా చిక్కుకుపోయింది చాందినీ కుటుంబం. కానీ, ఆ ఇబ్బందిని పెద్దగా లెక్కచేయటం లేదు. 'మేము ఢిల్లీ నుంచి పానిపట్‌ చేరుకోవాలి. రోడ్డు రైతులతో నిండిపోవటం వల్ల ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉంది. ఇప్పటికే బాగా పొద్దుపోయింది. పిల్లలు ఆకలితో ఉన్నారు. నా భర్త ఏదైనా తీసుకువద్దామని దగ్గరలో ఉన్న దుకాణం దగ్గరకు వెళ్లబోయారు. ఇంతలో నిరసన తెలుపుతున్న రైతులు మమ్మల్ని పిలిచి, తిన్నంత ఆహారం పెట్టారు. మేము కొంచెం ఆలస్యంగానైనా మా గమ్యస్థానానికి చేరుకుంటాం. కానీ, ఈ రైతులను రోడ్డు మీదికి తెచ్చిన ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలి.'' అన్నారు చాందిని. ఈ విధంగానే అనేకమంది సంఘీభావం రైతు పోరాటానికి లభిస్తోంది.


ఎంతోమంది ఆ సరిహద్దు ప్రాంతాల్లో రైతు శిబిరాల వద్ద ఎన్నో సేవలు అందిస్తున్నారు. కొందరు తమ పిల్లాపాపలతో సహా అక్కడే ఉంటున్నారు. నిరుపేద కుటుంబాలు కొన్ని, ఆ శిబిరాల వద్దనే ఉంటూ పరిసరాలను శుభ్రపర్చటం వంటి పనులు చేస్తున్నాయి. ఐదో తరగతి చదువుతున్న సాహిల్‌ తల్లిదండ్రులిద్దరూ దినసరి కూలీలు. లాక్‌డౌన్‌ సమయంలో వారి ఉద్యోగాలు పోయాయి. వారిప్పుడు అక్కడే ఉంటున్నారు. రైతులు బాగుంటేనే కదా, మాకు వ్యవసాయ పనులు దొరుకుతాయి అని వారంటున్నారు.


'మాకు ఇక్కడ సరిపడినంత ఆహారం, పండ్లు, స్వీట్లు ఇస్తున్నారు. స్వీట్లు సంవత్సరానికి ఒకసారి కూడా తినేవాళ్లం కాదు. అటువంటిది మాకు ఇక్కడ కడుపునిండా భోజనం పెడుతున్నారు. బాగా తిని, బాగా చదువుకోండని ఈ అంకుల్స్‌ చెబుతున్నారు' అంటోంది 3వ తరగతి చదువుతున్న హిమాన్షి. ఆమె తల్లి ఇంటిపని కార్మికురాలు, తండ్రి దినసరి కూలీ. లాక్‌డౌన్‌లో స్కూళ్లు మూతపడడంతో హిమాన్షితో పాటు ఆమెతోటి వయసు పిల్లలు మరో నలుగురు కలసి ఇప్పుడు చెత్తను ఏరుకుంటూ కనపడుతున్నారు. ఖాళీ సీసాలు ఏరడం, ప్లాస్టిక్‌ను సేకరించడం వారి దినచర్యగా మారిపోయింది. ఇప్పుడు అటువంటి పిల్లలెందరికో అక్కడ భోజనం దొరుకుతోంది.


ఢిల్లీలో వివిధ ఉద్యోగాలు చేసే యువకులు, దంపతులు వారాంతాల్లో రైతు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. రైతులు సంతోషంగా ఉంటేనే కదా మనకు కాస్త అన్నం దొరుకుతుంది. ఇలాంటి రైతుల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించటం ఏమాత్రం బాగోలేదని విమర్శించారు అక్కడ సేవలు అందిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు సుశాంత్‌. ఇలా ఎందరో రైతు పక్షాన నిలబడి నినదిస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలి. మెట్టు దిగి రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి. ఆకలి గొన్న వారి కడుపు నింపుతున్న రైతన్నల న్యాయమైన డిమాండ్లు నెరవేరాలని ఈ పండుగ సాక్షిగా కోరుకుందాం.